మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీని తప్పకుండా నిలబెట్టే నాయకుడిగా పేరుపొందారు. “చెప్పారంటే చేస్తారు” అన్న నమ్మకం ఆయనపై అద్దంకి ప్రజల్లో బలంగా ఉంది. ఆయ‌న వ‌రుస‌గా ఐదు ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డానికి కూడా ఇదే కారణం. సామాన్యులకు అందుబాటులో ఉండే నాయకుడిగా పేరొందిన ర‌వి ఇప్పుడు ఓ కీలక సవాలును ఎదుర్కొంటున్నారు. అద్దంకి నియోజకవర్గం గ‌తంలో ప్రకాశం జిల్లాకు చెందింది. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, జిల్లా పునర్విభజన సమయంలో అద్దంకిని బాపట్ల జిల్లాలో చేర్చారు. ఈ నిర్ణయం స్థానిక ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే బాపట్ల జిల్లా కేంద్రం అద్దంకి నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రజలు ఒక రోజు సమయం తీసుకుని అక్కడికి వెళ్లాల్సి వస్తోంది. అందుకే అద్దంకిని తిరిగి ప్రకాశం జిల్లాలో కలపాలని డిమాండ్ పెరుగుతోంది.


గ‌త ఎన్నికల సమయంలో ఈ డిమాండ్‌పై స్పందించిన గొట్టిపాటి రవికుమార్‌, “అద్దంకిని తిరిగి ప్రకాశం జిల్లాలో కలపడానికి కృషి చేస్తాను” అని హామీ ఇచ్చారు. కానీ జిల్లాల పునర్విభజన అంశాన్ని పరిశీలించడానికి ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం ఇప్పటివరకు కేవలం రెండు సార్లు మాత్రమే సమావేశమైంది. ఆ రెండు సమావేశాల్లో కూడా అద్దంకి సమస్యపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇటీవ‌ల అధికారులు మాత్రం ఈ విషయంలో కదలికలు ప్రారంభించినట్లు సమాచారం. బాపట్ల జిల్లా నుంచి అద్దంకిని వేరు చేసి ప్రకాశంలో చేర్చేందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు చెబుతున్నారు. సరిహద్దుల మార్పు సాధ్యాసాధ్యాలపై నివేదిక సిద్ధం చేయడం ప్రారంభమైంది. ఆ నివేదిక పూర్తయిన తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.


ఇక మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఇప్పుడు చిలకలూరిపేటలోనే ఎక్కువగా ఉంటున్నారు. అయినప్పటికీ అద్దంకి ప్రజలు ఆయనను తరచుగా కలుసుకుని తమ సమస్యలను తెలియజేస్తున్నారు. ఈ ప్రక్రియ వేగం పెరిగితే, ప్రజల ఎన్నో ఏళ్ల డిమాండ్‌ నెరవేరే అవకాశం ఉంది. ప్రభుత్వం అద్దంకిని తిరిగి ప్రకాశం జిల్లాలో చేర్చితే, స్థానిక ప్రజలకు పెద్ద ఊరట లభిస్తుంది. మొత్తం మీద, అద్దంకి భవిష్యత్తు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంది. గొట్టిపాటి రవికుమార్‌ మాట నిలబెట్టుకుంటారా? ప్రజల ఆశలు ఫలిస్తాయా? అనేది త్వరలోనే తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: