బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే మూడోసారి అధికారంలోకి వచ్చిందో అప్పటినుండి మావోయిస్టులను ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా జల్లెడ పడుతున్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఎంతోమంది మావోయిస్టులను హతం చేయడంతో పాటు ఎంతోమందిని జనజీవ స్రవంతిలోకి కలుపుకున్నారు. చాలామంది మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి ప్రజల్లో కలిసి పోయారు.ఇప్పటికే మావోయిస్టుల్లో అగ్ర నేతలుగా ఉన్న మల్లోజుల వేణుగోపాలరావు, వాసుదేవరావు వంటి వాళ్లు ఆయుధాలు వదిలేసి జనాల్లో కలిసి పోయారు.. కొంతమంది మాత్రం ఆయుధాలు వదిలిపెట్టడం లేదు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టుల్లో అగ్రనేత అయినటువంటి మడ్వా హిడ్మాని పోలీసులు భారీ ఎన్కౌంటర్లో హతం చేసినట్టు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఆపరేషన్ హిడ్మా పేరుతో ఆయన్ని భద్రత బలగాలు పట్టుకోవాలని చూస్తున్నారు. అయితే తాజాగా ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం వద్ద జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత అయినటువంటి హిడ్మా హతమైనట్టు తెలుస్తోంది. 

ఈరోజు ఉదయం మారేడుమిల్లిలోని అడవి ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో హిడ్మా హతమయ్యారు. హిడ్మాతో పాటు ఆయన భార్య కూడా చనిపోయినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.వీరిద్దరితోపాటు మరో నలుగురు మావోయిస్టులు కూడా హతమైనట్టు తెలుస్తోంది. మరి ఇన్ని రోజులుగా కేంద్ర బలగాలను ముప్పు తిప్పలు పెట్టి దేశాన్ని గడగడలాడించిన ఈ హిడ్మా ఎవరు.. ఈయన రియల్ లైఫ్ ఏంటి..ఎప్పుడు మావోయిస్టు పార్టీలోకి చేరారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..చత్తిస్ ఘడ్ రాష్ట్రం సుక్మా జిల్లా జేగురుగొండ పరిధిలోని పువ్వర్తి చెందిన ఆదివాసి బిడ్డ మాడ్వి హిడ్మా.. అయితే హిడ్మా చదివింది 5తరగతే అయినప్పటికీ 25 ఏళ్ల వయసులోనే నక్సలిజాన్ని ఎంచుకున్నారు. అలా 25 ఏళ్ల వయసులో అజ్ఞాతంలోకి వెళ్లిపోయి అడవిలోకి వెళ్లి ఆయుధం పట్టుకొని మావోయిస్టుగా మారారు. ప్రస్తుతం 51 ఏళ్లు ఉన్న హిడ్మా మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా చాలా రోజుల నుండి కేంద్ర బలగాలను ముప్పు తిప్పలు పెడుతున్నారు.

 మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ)-1కి బెటాలియన్ కమాండర్ గా ఉన్న హిడ్మా ఆధ్వర్యంలోనే ఎంతోమంది నక్సలిజాన్ని నేర్చుకున్నారు. హిడ్మా నేతృత్వంలోనే ఎన్నో దాడులు జరిగాయి. అంతే కాదు పిఎల్ జీఏ సభ్యులకు శిక్షణ ఇచ్చి వారిని బెటాలియన్ గా తయారు చేయడంలో హిడ్మా ప్రధాన పాత్ర పోషించాడు. అలా ఒక్కో బెటాలియన్ లో 200 మంది మావోయిస్టులు ఉండేవారు. ఇక చత్తిస్ ఘడ్ లో జరిగిన దాదాపు 25 దాడుల్లో ప్రధాన సూత్రధారిగా హిడ్మా ఉన్నారు. ఈయన వల్ల 2010లో 74 మంది సీఆర్ఎఫ్ జవాన్లు మరణించారు. 2010లో చత్తిస్ ఘడ్ లోని సుక్మా జిల్లా తాడిమెట్ల అడవి ప్రాంతంలో మైన్ ప్రొటెక్షన్ వెహికల్ ని మందు పాతరలతో పేల్చి కాల్పులు జరిపారు. అలా 74 మంది సీఆర్ఎఫ్ జవాన్లను హిడ్మా పొట్టన పెట్టుకున్నారు.అలాగే అదే సుక్మా జిల్లాలో 2017లో రోడ్డు నిర్మాణ పనులకు భద్రత కల్పించడానికి వెళ్తున్న  సిఆర్ఎఫ్ జవాన్లను మందు పాతరలతో పేల్చేసి దాదాపు 12 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్నారు.

 2017 ఏప్రిల్ లో రోడ్డు పనులకు భద్రతగా వెళ్తున్న 24 మంది సీఆర్ఎఫ్ జవాన్లని హతం చేశారు. 2018లో సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో మందు పాతర పేల్చి 12 మంది జవాన్లని హతం చేశారు. 2020లో సుక్మా జిల్లా పిడిమెట అడవి ప్రాంతంలో మందు పాతర పేల్చి 12 మంది డిఆర్ జే జవాన్లను చంపేశారు. ఇలా ఎంతోమంది సిఆర్ఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకొని మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు గా పేరు తెచ్చుకున్న హిడ్మాని తాజాగా పోలీసులు హతమార్చారు. హిడ్నా ఆధ్వర్యంలో దాదాపు 26 ఆపరేషన్లు జరిగాయి. భారీ దాడుల్లో స్వయంగా పాల్గొని మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా మారిపోయారు. ఇక హిడ్మా మీద కోటి రూపాయల రివార్డు కూడా ఉంది. వారం రోజుల క్రితమే హిడ్మా తల్లి దగ్గరికి చత్తిస్ ఘడ్ హోంమంత్రి వెళ్ళినప్పుడు ఇప్పటికైనా ఇంటికి రా బిడ్డ అంటూ హిడ్మా తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. అలా మావోయిస్టు పార్టీలో భారీ గెరిల్లా దాడులకు వ్యూహ కర్తగా ఉన్న హిడ్మా ఎన్కౌంటర్లో మరణించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 2026 కల్లా మావోయిస్టులను లేకుండా చేస్తామని భీష్మించుకు కూర్చున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: