అమరావతి రాజధాని అని తెల్లారిలేస్తే కలవరించే నాటి సీఎం చంద్రబాబు కావాలని చేశారా, లేక పొరపాటు జరిగిందా అన్నది తెలియదు కానీ ఓ తప్పు చేశారని అంటున్నారు. ఆ తప్పు వల్లనే ఇపుడు అధికారంలోకి వచ్చిన వైసీపీకి ఎంతో వెసులుబాటు కలిగిందని చెబుతున్నారు. కనీస మౌలిక విషయాలను విస్మరించారని కూడా చెబుతున్నారు. ఈ కారణంగానే వైసీపీ మంత్రులు పెద్ద నోరు చేసుకుని మాట్లాడేందుకు వీలు కలిగిందని అంటున్నారు. ఇంతకీ ఏంటా తప్పు..


అంటే అమరావతి పేరు మీద ఎక్కడా నాటి చంద్రబాబు సర్కార్ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదంటున్నారు. దాని మీదనే వైసీపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ పదే పదే అమరావతి గురించి ప్రస్తావిస్తున్నారని అంటున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను అమరావతి విషయంలో అన్న మాటకు కట్టుబడిఉన్నానని చెప్పారు. అమరావతికి ఇప్పటికీ గెజిట్ నోటిఫికేషన్ లేదని ఆయన అంటున్నారు.


తాను అమరావతి గెజిట్ నోటిఫికేషన్ అడిగితే సీఆర్డీయే  ఏర్పాటు చేస్తూ ఉన్న  గెజిట్ నోటిఫికేషన్ చూపిస్తున్నారని బొత్స అనడం విశేషం. అందులో ఎక్కడా అమరావతి అన్న పేరు లేకుండా ఉందని ఆయన చెప్పారు. తాను అడిగిన దానికి ఇప్పటికైనా టీడీపీ నేతలు గెజిట్ నోటిఫికేషన్ అమరావతి రాజధాని అని  చూపించమనండి అని బొత్స డిమాండ్ చేశారు. అమరావతి అన్న మాట లేకుండా చేసింది గత సర్కారేనని కూడా ఆయన చెప్పారు.


ఇదిలా ఉండగా అమరావతి పేరు చెప్పి అయిదేళ్ళు గడిపేసిన బాబు సర్కార్ ఎన్నికలకు మూడు నెలల ముందు 36 వేల కోట్ల ప్రాజెక్ట్ పనులను ఆదరాబాదరాగా అప్పగించారని అంటున్నారు. వాటికి ఎక్కడా కూడా బ్యాంక్ గ్యారంటీ లేదని కూడా చెప్పారు. మొత్తానికి  బొత్స మాటలు చూస్తూంటే అమరావతి మీద బాగానే స్టడీ చేశారని అర్ధమవుతోంది. మరి అమరావతి అన్న పేరు ఎక్కడా టీడీపీ సర్కార్ ప్రస్తావించకపోవడం అంటే పెద్ద తప్పే. దాని మీద టీడీపీ ఇపుడు ఏం సమాధానం చెబుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: