సొంతగడ్డపై జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ ను సాధించాలన్న కలకు అడుగుదూరంలో బ్రెజిల్ బోల్తాకొట్టింది. జర్మనీతో జరిగిన సెమీస్ లో దారుణంగా భంగపడింది. ప్రపంచ అగ్రశ్రేణి జట్టు మరీ ఇంత దారుణంగా ఓడడం అటు స్వదేశీ అభిమానులను విచారంలో ముంచెత్తగా, ఇటు సాకర్ వర్గాలను విస్మయపరిచింది. ఇక, పట్టుదలకు మారుపేరుగా నిలిచే జర్మన్లు 7-1తో ఆతిథ్య జట్టుపై నెగ్గి ఫైనల్లోకి దూసుకెళ్ళారు. మ్యాచ్ 90వ నిమిషంలో ఆస్కార్ కొట్టిన గోల్ తో బ్రెజిల్ పరువు కాపాడుకుంది. ఇక, మూడోస్థానం కోసం జరిగే పోరులో బ్రెజిల్... అర్జెంటీనా, నెదర్లాండ్స్ మ్యాచ్ లో ఓడిన జట్టుతో తలపడనుంది. కెప్టెన్ థియాగో సిల్వా ఈ మ్యాచ్ కు దూరం కావడం బ్రెజిల్ రక్షణశ్రేణిని బలహీనపర్చింది. ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకున్న జర్మనీ ఫార్వర్డ్ దళం బ్రెజిల్ గోల్ కీపర్ ను ఎడతెగని దాడులతో ఉక్కిరిబిక్కిరి చేసింది. బ్రెజిల్ తన వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత భారీ ఓటమి నమోదు చేసుకుంది. జర్మనీతో గతరాత్రి జరిగిన పోరులో బ్రెజిల్ 1-7 తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు 1998 వరల్డ్ కప్ ఫ్రాన్స్ 3-0తో బ్రెజిల్ ను చిత్తు చేసింది. నిన్నటివరకు బ్రెజిల్ కు ఇదే భారీ ఓటమి. తాజా సెమీస్ తో ఆ ఓటమి తెరమరుగైంది. కాగా, అంతర్జాతీయ మ్యాచ్ లలోనూ ఆ జట్టుకు ఇదే అతిపెద్ద ఓటమి రికార్డు. 1920లో ఉరుగ్వే చేతిలో 0-6తో భంగపడింది. ఇప్పుడా రికార్డు సమమైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: