ఒక వర్తకుడు తన వర్తకం కోసం ఒక గాడిదను కొని దాన్ని చాలా జాగ్రత్తగా మేపేవాడు. ప్రతిరోజు కొన్ని సరుకుల మూటలను దానిపై వేసి తీసుకొని వెళ్లి అమ్ముకుంటు జీవనం కొనసాగించేవారు.ఆ గాడిద ఆ వర్తకుడి కి జీవనాధారంగా మారింది..

వేసవిలో ఒక రోజున అతడు గాడిదపై సరుకులు వేసి పక్క ఊరికి వెళ్లి అమ్ముకోవచ్చు అని అనుకొని బయలుదేరాడు. ఆరోజున ఎండ చాలా ఎక్కువగా ఉంది. కొంతదూరం వెళ్ళిన తరువాత అతనికి ఒక ప్రయాణికుడు తోడయ్యాడు. కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళు గాడిద తో కలిసి ఎంతో దూరం ప్రయాణం చేశారు. ఎండ తీవ్రతవల్ల, నడక వల్ల వారికి చాలా నీరసం అనిపించింది. అందుచేత కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని వెళ్లవచ్చునని వాళ్లు ఇద్దరూ గాడిదను ఒక పక్కన నిలబెట్టారు. వెంటనే ప్రయాణికుడు వెళ్లి గాడిద నీడలో పడుకున్నాడు. ఎండ చాలా ఎక్కువగా ఉంది. వర్తకుడికి నీడే లేకుండా పోయింది. అందుచేత అతడు కోపంగా "ఇది నా గాడిద.. దీని నీడలో నిద్రించే హక్కు నాకే ఉంది " అని అన్నాడు.


ముందుగా నేను పడుకున్నాను. కనుక ఈ నీడ నాదే! పైగా నేను పడుకునే వరకూ ఆ నీడనే  నీవు చూడలేదు."అన్నాడు బాటసారి.. ఎంతసేపైనా వారి వాదనలు పూర్తి కావడం లేదు. వీరిద్దరి వాదనలు చూసి విసిగిపోయింది గాడిద.
       
ఒక పక్క ఎండ వేడి, మరోపక్క వీళ్ళిద్దరి వాదోపవాదాలు భరించలేకపోయింది ఆ గాడిద. చల్లగా పక్క నుండి జారుకొని ఎటో వెళ్లిపోయింది. వాళ్ల గొడవ పూర్తయ్యే సరికి గాడిద అక్కడ లేదు. లబోదిబోమని మొత్తుకుంటూ వర్తకుడు దాన్ని వెతకడానికి పరుగు లంకించుకున్నాడు. ఏదైనా ఉన్నప్పుడు వాదనకు దిగకుండా ఇద్దరు సర్దుకొని పోయి ఉంటే ఏ ఇబ్బంది వచ్చి ఉండేది కాదు.. ఎవరికి వారు స్వార్థం చూపించారు కాబట్టే ఉన్న నీడ కాస్తా చేజారి పోయి ఎండకు మలమల  మాడిపోయారు.. ఇక గాడిద ఎటుపోయిందో తెలియక వర్తకుడు లబోదిబో మన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: