ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని తన భుజాన్ని తానే చరచుకునే చంద్రబాబునాయుడు తాజాగా విడుదల చేసిన మ్యానిఫెస్టోనే చివరిదా ? అంటే అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. మామూలుగా సాధారణ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు మ్యానిఫెస్టోను విడుదల చేయటం సహజం. ఇదే సమయంలో లోకల్ బాడీ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ప్రత్యేకించి ఏ పార్టీ కూడా మ్యానిఫెస్టో అంటు విడుదలచెయ్యదు. ఇక అధికారపార్టీ నేతలయితే తమ ప్రభుత్వ విధానాలనే స్ధానికసంస్ధల ఎన్నికల సందర్భంగా చెప్పుకుంటారంతే. ప్రతిపక్షాలు మ్యానిఫెస్టోను ప్రత్యేకించి ఎందుకు రిలీజ్ చెయ్యవంటే రిలీజ్ చేసినా ఎలాంటి ఉపయోగం ఉండదు కాబట్టి. మరి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు ఈ విషయం తెలీకే ‘పంచాయితి ఎన్నికల్లో పంచసూత్రాల’ పేరుతో ఓ మ్యానిఫెస్టో విడుదల చేశారా ?
ఇక్కడే వైసీపీ ఎంఎల్ఏ అంబటి రాంబాబు ప్రధాన ప్రతిపక్ష నేతను ఎద్దేవా చేస్తున్నారు. మ్యానిఫెస్టోను విడుదల చేసే చివరి అవకాశం ఇదే అని చంద్రబాబుకు అనుమానం వచ్చినట్లుందని అంబటి గాలి తీసేశారు. మొన్నటి సాధారణ ఎన్నికల్లో టీడీపీ మ్యానిఫెస్టోను జనాలు నమ్మలేదు. ఎందుకంటే 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో చంద్రబాబు ఒక్కదాన్ని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు. దాంతో జనాలు మొన్నటి ఎన్నికల్లో టీడీపీ గూబ పగలగొట్టేశారు. ఇక 2024 ఎన్నికల్లో కూడా చంద్రబాబు మ్యానిఫెస్టోను విడుదల చేసినా జనాలు నమ్మే పరిస్ధితి లేదని అంబటి బల్లగుద్ది మరీ చెప్పారు.
ఎందుకంటే 2019 ఎన్నికల సమయంలో తమపార్టీ ఇచ్చిన హామీలనే కాకుండా అదనంగా కూడా జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారట. కాబట్టి ప్రజలు జగన్ని కాకుండా చంద్రబాబును నమ్మే సమస్యే లేదన్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం చంద్రబాబుకు లేదన్నారు. అందుకనే ఇపుడు జరుగుతున్న పంచాయితి ఎన్నికల్లో మ్యానిఫెస్టో పేరుతో డ్రామాలు మొదలుపెట్టినట్లు ఆరోపించారు. పార్టీ రహితంగా జరిగే పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రత్యేకంగా మ్యానిఫెస్టోను చంద్రబాబు రిలీజ్ చేయటంలో ఉద్దేశ్యం ఏమిటో చెప్పాలంటూ చంద్రబాబును అంబటి డిమాండ్ చేశారు. పనిలో పనిగా పంచాయితి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా మ్యానిఫెస్టో రిలీజ్ చేసినందుకు చంద్రబాబు, టీడీపీపై నిమ్మగడ్డ కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ పదే పదే మంత్రులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి చంద్రబాబుపై చర్యలకు వస్తున్న డిమాండ్ ను నిమ్మగడ్డ పట్టించుకుంటారా ?

మరింత సమాచారం తెలుసుకోండి: