
వైసీపీ అరాచకాలపై ప్రతిపక్షంగా తెలుగుదేశంపార్టీ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తోందని చంద్రబాబునాయుడు ప్రతిరోజు ప్రచారం చేసుకుంటున్నారు. పంచాయితి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పాలనపై జనాల్లో వ్యతిరేకత బయటపడుతోందని సీనియర్ తమ్ముళ్ళు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు లాంటివాళ్ళు ప్రతిరోజు మీడియాలో ఒకటే ఊదరగొడుతున్నారు. తమ వాదనకు మద్దతుగా ఏవో లెక్కలు కూడా చూపిస్తున్నారు. పంచాయితి మొదటివిడత ఎన్నికల్లో టీడీపీకి 38 శాతం ఓట్లు రావటమే ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనమని చంద్రబాబు ఓ పిచ్చిలెక్కను జనాల బుర్రల్లోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. 38 శాతం ఓట్లు ప్రతిపక్షానికి వస్తే 60 శాతం ఓట్లు అధికారపక్షానికి వచ్చిన విషయం చంద్రబాబు మాటల్లోనే బయటపడుతోంది.
సరే ఈ పిచ్చిలెక్కలను పక్కన పెట్టేస్తే తెల్లారి లేస్తే జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేయటంలో చంద్రబాబుతో పాటు రాష్ట్రపార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు యనమల, దేవినేని ముందువరసలో ఉంటారు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు బాగానే చక్రం తిప్పిన వాళ్ళే వీళ్ళంతా. అలాంటి వీళ్ళ సొంత నియోజకవర్గాల్లో పంచాయితి ఎన్నికల ఫలితాలు ఎలాగ వచ్చాయి. ఇపుడిదే ఆసక్తిగా మారింది. మామూలుగా అయితే అసలు వీళ్ళ నియోజకవర్గాల్లో వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ మద్దతుదారులను గెలిపించుకునే అవకాశం లేదనే అనుకుంటారంతా. కానీ జరిగింది దానికి భిన్నం.
ఇంతకీ విషయం ఏమిటంటే యనమల నియోజకవర్గమైన తుని, దేవినేని నియోజకవర్గమైన మైలవరం, అచ్చెన్న నియోజకవర్గమైన టెక్కలిలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. వైసీపీ అంటే అధికారపార్టీ మద్దుతుదారులు అనర్ధం. తునిలో 58 పంచాయితీలుంటే కనీసం ఒక్కటంలే ఒక్క పంచాయితిలో కూడా టీడీపీ మద్దతుదారులు గెలవలేదు. చివరకు యనమల సొంత గ్రామపంచాయితిలో కూడా వైసీపీనే గెలిచింది. ఇక దేవినేని సొంత నియోజకవర్గమైన మైలవరంలోని 48 పంచాయితీలలో 44 పంచాయితీల్లో వైసీపీ గెలిచింది. చివరగా టెక్కలిలోని 135 పంచాయితీల్లో 134 చోట్ల వైసీపీ మద్దతుదారులు గెలిచారు. కాకపోతే అచ్చెన్నకు ఒకటే ఊరట ఏమిటంటే సొంత గ్రామపంచాయితి నిమ్మాడలో మాత్రం టీడీపీనే గెలిచింది. మరి ఈ లెక్కలతో యనమల, దేవినేని, అచ్చెన్న ప్రజల కోసం పోరాటాలు చేస్తున్నారా ? లేకపోతే ప్రజలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారని అనుకోవాలా ?