
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్‌గా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కన్వీనర్‌గా ఆయన ఎన్నికకావడం వరుసగా ఇది మూడోసారి కావడం విశేషం. ఆదివారంనాడిక్కడ జరిగిన 'ఆప్' నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు. త్వరలో వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ఏకగ్రీవ ఎన్నిక ఆ పార్టీకి మరిన్ని విజయాలను సాధించిపెడుతుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కేజ్రీవాల్ 2016 ఏప్రిల్‌లో రెండోసారి కన్వీనర్‌గా ఎంపికయ్యారు. మూడేళ్ల పాటు సేవలందించారు. 2019 లోక్‌సభ ఎన్నికలు, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కారణంగా కేజ్రీవాల్ పదవీకాలం గతేడాది వరకు పొడిగించారు. 2020లో కొవిడ్ రావడంతో పార్టీ నేషనల్ కౌన్సిల్ సమావేశం వాయిదా వేశారు. ఈ ఏడాది జనవరిలో నేషనల్ కౌన్సిల్ సమావేశమై పార్టీ రాజ్యాంగానికి సవరణలు చేయడంతో పార్టీ కన్వీనర్ పదవీకాలాన్ని ఐదు సంవత్సరాలకు పెంచారు. అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆప్ మరిన్ని రాష్ట్రాల్లో పోటీచేసి సరికొత్త రాజకీయాన్ని ప్రజలకు పరిచయం చేయాలని కోరుకుంటున్నట్లు ఆ పార్టీ నేతలంటున్నారు.