ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అసమర్థత వల్ల వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు ప్రభుత్వం సహాయం అందడం లేదని మండిపడ్డారు. ప్రకృతి శాపానికి, పాలకుల నిర్లక్ష్యం, జగన్ రెడ్డి పాపం తోడై రైతులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్ల వైకాపా పాలనలో ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించిందని ధ్వజమెత్తారు.


విత్తన సరఫరా లో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఎరువులు లభించక ఇబ్బందులు ఎదుర్కోవడంతోపాటు ధరలు విపరీతంగా పెరగడంతో పంట పెట్టుబడి పెరిగిందన్నారు. అరకొర దిగుబడి గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఇటీవల వరదల కారణంగా వేలాది ఎకరాల్లో రైతులు పంటలు కోల్పోయినప్పటికీ ప్రజాప్రతినిధులు, మంత్రులు ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని ధ్యాస, ఆలోచన ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు. మూడేళ్ల జగన్ రెడ్డి పాలనలో 212 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. అప్పుల బాధలు తాళ్ళలేక, పంటదిగుబడి లేక చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్యలే శరణ్యమని రైతులు భావిస్తున్నట్లు తెలిపారు. రైతు ఆత్మహత్యల్లో ఆంధ్ర రాష్ట్రం దేశంలో రెండవ స్థానంలో ఉందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap