గ్రామ స్థాయి నుండి దేశ స్ధాయి వరకు ప్రస్తుతం ఒకటే నినాదం.. ప్లాస్టిక్ రహిత భారతమే మన లక్ష్యం కావాలని ప్రధాని మొదలుకొని, ఎందరెందరో పిలుపునిస్తున్నారు. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు సైతం ఎన్నో కార్యక్రమాలను రూపొందిస్తున్నాయి. ఎన్నో ప్రణాళికలతో ప్రభుత్వాలు ముందుకెళ్తున్నా ప్లాస్టిక్ వాడకం పూర్తిస్ధాయిలో తగ్గడం లేదు. అయితే కొద్దిమంది యువకులు మాత్రం దాన్ని అచరణకు తెస్తూ అందులోనే ఉపాధిని వెతుక్కుంటున్నారు. ప్రస్తుతం ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సొంత నియోజక వర్గం కుప్పంలో కొంతమంది యువకులు చేస్తున్న పాల వ్యాపారానికి మంచి గిరాకీతో పాటు ప్రజల్లో కొంత అవగాహన పెరుగుతోంది.


కుండతో పాలు పోస్తున్నఈ యువకులు పాతికేళ్ల వయసు వారే.  అందరివీ ప్రాథమికంగా వ్యవసాయ కుటుంబాలే. ఇంజనీరింగ్ లు పూర్తి చేసి అటు బెంగళూరు, ఇటు స్థానికంగా కూడా ఐదంకెల వేతనాలు పొందేవారే. మితిమీరిన ఆధునికత, కృత్రిమ ఆహారం, కల్తీ వంటివి ఆరోగ్యాలను ఛిద్రం చేస్తున్నాయనే స్పృహతో స్వచ్ఛమైన జీవనం కోసం నగర జీవులు పడుతున్న తపన .. ఆ కుప్పం యువకుల్లో ఆలోచనలు రేపాయి. సొంతూళ్లోనే స్వచ్ఛ వ్యాపారానికి మార్గం చూపాయి.  


ప్లాస్టిక్‌ రహితంగా తమ వ్యాపారం సాగాలనే ఆలోచనల్లోంచి పురుడు పోసుకున్నది మట్టికుండ. అవ్వతాతల కాలం నాటి ఈ వినియోగ పాత్రే ఈ యువత కొత్త పాల వ్యాపారానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారింది. అదే ఫామ్‌ టు హోమ్‌ కి పురుడు పోసింది. చందం గ్రామంలో ఇంటివద్దే సుమారు 20 ఆవులతో ఒక ఫామ్‌ ఏర్పాటు చేసుకుని, రోజుకు 70 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తున్నారు. అదే గ్రామంలోని మరో ఏడుగురు పాడి రైతులనుంచి 120 లీటర్లు పాలను సేకరిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు విడతలుగా ఈ పాలు సేకరించి ...పాలను కుప్పంకి క్యాన్ ల ద్వారా తరలిస్తారు. ఇక్కడ పరిశుభ్రం చేసి సిద్ధంగా ఉంచిన మట్టి కుండల్లో వీటిని నింపి, స్వయంగా ఇంటింటికీ పాలను చేరవేస్తారు. ఇలా రోజుకు 200 లీటర్ల పాలను నేరుగా వినియోగదారుల ఇళ్లకు సరఫరా చేయగలుగుతున్నారు. పాలు కొన్న వినియోగ దారులు సైతం ఆరోగ్యకరంగా ఉండటంతో వారు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.    


వినియోగదారులకు పాల కుండను సరఫరా చేశాక.. మరుసటి రోజున మరో పాల కుండను సరఫరా చేసి ముందు రోజు ఇచ్చిన పాల కుండను తీసుకొచ్చేస్తున్నారు. అలా తీసుకొచ్చిన కుండలను చందం గ్రామానికి చేర్చి, అక్కడ పరిశభ్రం చేసి, ఎర్రటి ఎండలో పగలంతా ఎండబెడతారు. పూర్తిగా క్రిమిరహితంగా కుండలు మారుతాయి. ఈ సంప్రదాయ శుద్ధి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పర్వావరణానికి కూడా ఇది మేలు చేస్తుందని అంటున్నారు యువకులు.  ఓ పక్క పాలను మట్టి కుండల్లో ఇవ్వడమే కాకుండా త్వరలో కూరగాయలను రైతుల నుండి నేరుగా చేరవేస్తామని అంటున్నారు.. స్వచ్ఛ్ భారత్  నినాదానికి పూర్తి స్ధాయిలో తమ వంతు న్యాయం చేస్తున్నారు కుప్పం యువకులు.  



మరింత సమాచారం తెలుసుకోండి: