
నిజానికి ఇసుక, సిమెంట్, స్టీల్ వంటి కీలక నిర్మాణ ముడిసరుకుల ధరలు గత కొన్నేళ్లుగా అదుపులోనే ఉన్నాయి. అయినా సరే, కూలీల ఖర్చులు పెరిగాయనే ఒక్క సాకుతో బిల్డర్లు, డెవలపర్లు ధరలను అమాంతం ఆకాశానికి చేర్చేశారు. వారి లాభాపేక్ష ముందు సామాన్యుడి స్తోమత చిన్నబోయింది. ఈ కృత్రిమ బాదుడుతో ఇప్పుడు కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో కళకళలాడాల్సిన రియల్ మార్కెట్ వెలవెలబోతోంది.
ఈ పరిస్థితిపై ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ 'అన్రాక్' ఓ బాంబు లాంటి నివేదికను బయటపెట్టింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు 11 శాతం పెరిగాయి. కానీ అదే సమయంలో అమ్మకాలు ఏకంగా 20 శాతం కుప్పకూలాయి. గత ఏడాది ఇదే కాలంలో లక్షా ఇరవై వేలకు పైగా ఇళ్లు అమ్ముడైతే, ఈసారి ఆ సంఖ్య 96 వేలకు పడిపోయింది. ఇది మార్కెట్ పతనానికి నిలువుటద్దం.
రియల్ ఎస్టేట్‌కు కేరాఫ్‌గా నిలిచిన మన భాగ్యనగరంపై ఈ ఎఫెక్ట్ మరీ తీవ్రంగా పడింది. హైదరాబాద్‌లో గృహ విక్రయాలు ఏకంగా 27 శాతం పడిపోయి, రియల్ వర్గాలకు కోలుకోలేని షాకిచ్చింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణే, కోల్‌కతా వంటి మహానగరాలు సైతం ఇదే బాటలో పయనిస్తుంటే, ఒక్క చెన్నైలో మాత్రమే డిమాండ్ నిలకడగా ఉండటం గమనార్హం.
అడ్డగోలుగా పెంచిన ధరలు చూసి, ఇప్పట్లో ఇల్లు కొనడం అవివేకం అని కొనుగోలుదారుడు నిర్ణయించుకున్నాడు. ఇది బుడగలాంటి బూమ్ అని, ఎప్పుడో ఒకప్పుడు ఇది కచ్చితంగా పేలుతుందని, అప్పుడు ధరలు దిగివస్తాయనే 'వేచి చూసే ధోరణి' అవలంబిస్తున్నాడు. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం కూడా ఈ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీసింది.
మొత్తం మీద, బిల్డర్ల లాభాపేక్ష... సామాన్యుడి సొంతింటి కలను బలి తీసుకుంటోంది. ధరలు దిగివస్తేనే మార్కెట్ బతికి బట్టకడుతుంది... లేదంటే ఈ కాంక్రీట్ జంగిల్స్ లో కొనేవారే కరువయ్యే ప్రమాదం ఉంది.