
చత్తీస్గడ్ లోని సూరజ్పూర్ జిల్లాల్లో కూడా నమ్మశక్యం కాని ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒక వ్యక్తి మేక కన్ను గుచ్చుకొని ప్రాణాలు కోల్పోయాడు. ఇది వినడానికే విచిత్రంగా ఉంది కదా. కానీ సూరజ్ పూర్ జిల్లాలో ఈ ఘటన నిజంగానే వెలుగులోకి వచ్చింది. సమీపంలో ఉన్న ఆలయానికి వెళ్ళిన భగత్ సాయి అనే 50 ఏళ్ల వ్యక్తి ఇలా మేక కన్ను గుచ్చుకొని అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. మదన్పూర్ గ్రామానికి చెందిన సాయి ఇటీవల తన కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి ఆలయానికి వెళ్ళాడు. అక్కడ మొక్కు ప్రకారం మేకను బలి ఇచ్చాడు.
అయితే అనంతరం మేక మాంసాన్ని తినేందుకు అందరితో కలిసి కూర్చున్నాడు సాయి. ఇక సాయికి వడ్డించిన మాంసంలో మేక కన్ను కూడా వచ్చింది. అయితే దాన్ని ఎంతో ఉత్సాహంగా తినడమే అతని పాలిట శాపంగా మారిపోయింది అని చెప్పాలి. తనకి వచ్చిన మేక కన్నును ఎంతో ఆశగా నోట్లో వేసుకున్నాడు. అయితే అది గొంతులో ఇరుక్కుపోయింది. ఇక గొంతులోనే ఉండిపోయిన మేక కన్ను కారణంగా సాయి ఊపిరి పీల్చుకోలేకపోయాడు. చివరికి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అయితే గమనించిన మిగతా కుటుంబ సభ్యులు.. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అతని ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయాడు. శ్వాస నాలంలో మేక కన్ను అడ్డుగా నిలవడంతోనే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యుల నిర్ధారించారు.