
జీఎస్టీ అంటే మనం వస్తువులపై కట్టే పన్ను. జీఎస్టీ పెరుగుతుంది అంటే జనం దగ్గర డబ్బులు ఉన్నాయనే అర్థం. జీఎస్టీ వసూళ్లు తెలంగాణ, ఆంధ్రా, భారత్ లో పెరుగుతున్నాయి. అంటే దేశంలో వృద్ధి అంచెలంచెలుగా పెరుగుతోంది. తాజాగా సెప్టెంబరు నెల జీఎస్టీ వసూళ్లు గమనిస్తే ఈ నెలలో రూ.1.62 లక్షల కోట్లు జీఎస్టీ వసూలైనట్లు కేంద్రం ప్రకటించింది. గత ఏడాది ఇదే సమయానికి రూ.1.47 లక్షల కోట్లు వచ్చాయి. 10 శాతం వృద్ధి రేటు నమోదైంది.
అయితే జీఎస్టీ వసూళ్లు రూ.1.6 లక్షల కోట్లు దాటడం ఇది ఏడాదిలో నాలుగోసారి. సెప్టెంబరులో కేంద్ర జీఎస్టీ రూ.29,818 కోట్లు కాగా.. రాష్ట్ర జీఎస్టీ రూ.37,657 కోట్లు. సమీకృతం ద్వారా రూ.83,623 కోట్లు, వస్తు దిగుమతులపై రూ.41,145 కోట్లు, సెస్ల రూపంలో రూ.11,613 కోట్లు, దిగుమతులపై రూ.881 కోట్లు వచ్చినట్లు కేంద్రం వివరించింది. అత్యధిక జీఎస్టీ వసూళ్లు సాధించిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్ణాటక ముందుగా ఉన్నాయి.
మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. గత ఏడాదితో పోల్చితే తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు 33 శాతం పెరిగాయి. గతేడాది సెప్టెంబరులో రూ.3915 కోట్లు కాగా ఈ ఏడాది రూ.5226 కోట్లు. అంటే అదనంగా రూ.1226 కోట్లు వసూళ్లు వచ్చాయి. ఇక ఏపీ విషయానికొస్తే 17శాతం మేర పెరిగాయి. గతేడాది సెప్టెంబరులో రూ.3,132 కోట్లు ఉంటే ఈ సారి రూ.3,658 కోట్లు వసూలయ్యాయి. ఆర్థిక పరంగా దేశం, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయని చెప్పడానికి నిదర్శనమే ఈ వసూళ్లు.