తెలంగాణ ఎన్నికల్లో విజయంపై కాంగ్రెస్ గట్టిగానే దృష్టి సారించింది. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ కూడా బాగానే పెరగడంతో అధికారం గ్యారెంటీ అనే భావనలో హస్తం నేతలు ఉన్నారు. అందుకే ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు.


ఈ నేపథ్యంలో తెలంగాణ జనసమితి, సీపీఐ తో పొత్తు ఇలా పలు పార్టీల మద్దతు కూటగట్టింది. అయితే వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో షర్మిళ తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 3800 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.  ఏమైందో తెలియదు కానీ డీకే శివకుమార్ ద్వారా కాంగ్రెస్ లో వైటీపీని విలీనం చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ తెలంగాణలో మెజార్టీ నాయకులు వ్యతిరేకించడంతో  విలీన ప్రక్రియ ఆగిపోయింది. మరోవైపు 119స్థానాల్లో అభ్యర్థులను నిలబెడతామని ప్రకటించి.. మళ్లీ పోటీ నుంచి విరమించుకొని కాంగ్రెస్ కు మద్దతిస్తున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు.


అయితే మొన్నటి వరకు షర్మిళ మద్దతు ఉంటే మేలని భావించిన హస్తం నేతలు ఇప్పుడు ఆమె అవసరం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. కారణం ఏంటంటే ఇటీవల కేసీఆర్ నర్సంపేట సభలో ఆంధ్రా నేతలు ఇక్కడి ఎమ్మెల్యేను ఓడించేందుకు డబ్బు సంచులతో వస్తున్నారు అని వ్యాఖ్యానించారు. షర్మిళ కాంగ్రెస్ తో కలిస్తే ఇదే వాయిస్ 119 స్థానాల్లోను వినిపించేది. కాబట్టి షర్మిళ వల్ల పార్టీకి నష్టమే కానీ లాభం ఉండదని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.


2018 ఎన్నికల అనుభవం నేర్పిన పాఠం నుంచి కాంగ్రెస్ నేతలు జాగ్రత్త పడుతున్నారు. అందుకే షర్మిళను ప్రచారంలో కానీ.. సమన్వయ కమిటీ సమావేశాలకు పిలవడం లేదు. బహుశా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అప్పుడు ఆమెను పార్టీ లో చేర్చుకొని ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉంది. లేకపోతే ఆమెను ఏపీకి కూడా పరిమితం చేసే అవకాశాలు మెండుగానే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: