
అవును పంచాయితి ఎన్నికల ప్రక్రియ లోతుల్లోకి వెళితేనే అసలు విషయం కనబడదు. జరుగుతున్న పంచాయితి ఎన్నికల్లో నామినేషన్లు వేయటాన్నే చంద్రబాబునాయుడు చాలా ప్రతిష్టగా తీసుకున్నారు. నామినేషన్లు వేయటాన్నే చంద్రబాబు గెలిచినంత హడావుడి చేస్తున్నారు. ఇక ఇదే పద్దతిలో స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా ఏకగ్రీవాలకు వ్యతిరేకంగా ఒకటే గోల చేస్తున్నారు. ఎట్టి పరిస్ధితుల్లోను ఏకగ్రీవాలను అమోదించేది లేదని ప్రతి పంచాయితికి, వార్డు మెంబర్ కు ఎన్నికలు జరగాల్సిందే అంటూ నిమ్మగడ్డ పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. పైగా ఏకగ్రీవాలకు సహకరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పటం మరింత విచిత్రంగా ఉంది.
సరిగ్గా ఇక్కడే తమ్ముళ్ళలో చాలామంది చంద్రబాబు, నిమ్మగడ్డ మీద మండిపోతున్నారట. ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత కొంతమంది సీనియర్ నేతలు బీజేపీలోకి వెళ్ళిపోయారు. మరికొందరు వైసీపీలోకి మారిపోయారు. టీడీపీలో ఉన్న వారిలో చాలామంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో పెట్టిన కోట్ల రూపాయల ఖర్చు హారతి కర్పూరంలాగ అయిపోయింది కాబట్టి నిధుల విషయంలో చేతులెత్తేశారు. ఈ పరిస్ధితుల్లోనే పంచాయితీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులతో నామినేషన్లు వేయించాల్సిందే అని చంద్రబాబు పదే పదే ఒత్తిడి పెడుతున్నారు. పోటీ చేస్తారు సరే సర్పంచ్ పదవులకు, వార్డు మెంబర్లకు పోటీ చేసే వాళ్ళ ఖర్చులు ఎవరు భరించాలి ?
ఇక్కడే నేతల్లో తీవ్ర అసంతృప్తి పెరిగిపోతోంది. ఎందుకంటే మొన్నటి మార్చిలో అర్ధాంతరంగా ఆగిపోయిన జడ్పీటీసీ, ఎంపిటీసీ ఎన్నికల్లో కూడా చాలామంది నేతలు దూరంగా ఉండిపోయారు. అందుకనే చాలా చోట్ల వైసీపీకి అనుకూలంగా ఏకగ్రీవాలయ్యాయి. పోటీకి దూరంగా ఉండటం వల్ల తమ్ముళ్ళు ఖర్చులు మిగుల్చుకున్నారు. కానీ ఇపుడు పంచాయితి ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు ఒత్తిడి పెంచేస్తున్నారు. వార్డు మెంబర్ ఎన్నికలకు కూడా లక్షల్లో అయ్యే ఖర్చును ఎవరు పెట్టుకోవాలో తెలీటం లేదు. పోటీలోకి దించారు కాబట్టి నేతలపైనే మొత్తం ఖర్చు పడుతుంది. ఇపుడే ఇలాగుంటే రిటైర్ అయ్యేలోగా నిమ్మగడ్డ పెట్టేయబోయే మున్సిపల్, కార్పొరేషన్, జడ్పీటీసీ, ఎంపిటీసీ ఎన్నికల ఖర్చులను ఎవరు భరించాలో అర్ధంకాక తమ్ముళ్ళు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికల కోసమని పట్టుబట్టకుండా ఉంటే ఏకగ్రీవాలతో వ్యవహారం నడిచిపోయేది. ఇపుడు పోటీ చేసి గెలిచినా ఊడపొడిచేదేమీ లేదన్నదే తమ్ముళ్ళ బాధ. అనవసరంగా తమతో ఖర్చులు పెట్టిస్తున్నారనే విషయంలోనే తమ్ముళ్ళు చంద్రబాబు, నిమ్మగడ్డపై మండిపోతున్నారట.