
ఉపఎన్నిక జరిగిన తీరు చూసిన తర్వాత రాష్ట్ర బీజేపీ చీఫ్ పగ్గాలు మారిపోవటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. కమలంపార్టీ ప్రస్తుత అధ్యక్షునిగా సోమువీర్రాజున్నారు. వీర్రాజు ఎంతసేపు మీడియా సమావేశాల్లో, ట్విట్టర్లో హడావుడి చేయటమే తప్పించి క్షేత్రస్ధాయిలో బలమైన నేతకాదని తేలిపోయింది. ఈయనకు సొంతజిల్లా తూర్పుగోదావరిలోనే పట్టులేదట. ఏరోజు కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచింది కూడా లేదు. దాంతో ఈయనకున్న ప్రజాబలం ఏమిటనేది ఉపఎన్నికల సందర్భంగా జాతీయ నాయకత్వానికి బాగా అర్ధమైపోయిందని సమాచారం. ఉపఎన్నికలో ప్రచారం కోసం జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చినపుడు కూడా జనసమీకరణ పెద్దగా జరగలేదు. దాంతో వీర్రాజు పై నడ్డా బాగా అసంతృప్తిగా ఉన్నారనేది సమాచారం.
ఇక ఉపఎన్నికలో పోటీ చేయటం కోసమని జాతీయ నాయకత్వంపై వీర్రాజు బాగా ఒత్తిడి తెచ్చి జనసేన అధినేత పవన్ కల్యాణ్ణు ఒప్పించారు. ఎన్నికల నోటిఫికేషన్ కు నెలల ముందే తిరుపతిలో ప్రచారాన్ని ప్రారంభించిన వీర్రాజు పోటీచేయబోయే అభ్యర్ధిని నిర్ణయించటంలో మాత్రం ఫెయిలయ్యారు. చివరకు పార్టీలోనే చాలామందికి తెలీని కర్నాటక క్యాడర్ ఐఏఎస్ రిటైర్డు అధికారి రత్నప్రభను రంగంలోకి దింపారు. అభ్యర్ధి ఎంపికతోనే పార్టీ ఓటమి ఖాయమని తేలిపోయింది. ఉపఎన్నికలో గెలిచేది తామే అని వీర్రాజు అండ్ కో ఎంతచెప్పినా వాళ్ళు కతలు చెబుతున్నారనే విషయం ప్రతి ఒక్కళ్ళకు తెలుసు. అయితే బీజేపీ ఎలక్షనీరింగ్ ఇంత పూర్ గా ఉంటుందని ఎవరు ఊహించలేదు.
తిరుపతి నగరాన్ని మినహాయిస్తే మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా బీజేపీ నేతలు పెద్దగా కనబడలేదు. పేరుకు మాత్రం పెద్ద నేతలు చాలామందే ఉన్నారు. కానీ వాళ్ళంతా ఎయిర్ పోర్టు బ్యాచ్ అన్న విషయం ఇపుడు జాతీయస్ధాయిలో కూడా అందరికీ అర్ధమైపోయింది. క్షేత్రస్ధాయిలో పట్టుమని వంద ఓట్లు తీసుకువచ్చేస్ధాయి నేతలు ఒక్కళ్ళు కూడా లేరన్న విషయం నడ్డాకు మూడు రోజుల పర్యటనలో అర్ధమైపోయిందట. పార్టీ కమిటిలు వేసుకోకుండా, సమర్ధులైన నేతల సేవలను ఎన్నికల్లో ఉపయోగించుకోకుండా ఎన్నికల్లో ఎలా గెలుస్తామని అనుకున్నారంటు నేరుగా వీర్రాజునే నడ్డా నిలదీశారనే టాక్ నడుస్తోంది. సో జరిగిన పరిణామాలన్నింటినీ చూసిన తర్వాత తొందరలోనే పార్టీ పగ్గాలు మారిపోతాయనే ప్రచారం ఊపందుకుంది. మరి చూడాలి చివరకు ఏం జరుగుతుందో.