
ఆయన ఓ చిన్నపాటి సంకీర్ణ ప్రభుత్వాన్నే నడిపారు. కానీ ఇప్పుడు ఆయనకు మద్దతు ఇచ్చిన చిన్న చిన్న పార్టీలు కూడా ఆయన్ను వ్యతిరేకిస్తున్నాయి. చివరకు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన తర్వాత కూడా ఆయన సంకీర్ణంలో ఉన్న పార్టీలు విపక్షాల అవిశ్వాసానికి మద్దతు ప్రకటించాయి. ఆయన మంత్రి వర్గంలోని మంత్రులు కూడా రాజీనామా చేసి మరీ తమ నిర్ణయం ప్రకటించారు.
వాస్తవానికి పాక్ పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ ఏప్రిల్ 3న జరగాల్సి ఉంది. కానీ ఫలితం ముందే తెలిసిపోతుండటంతో అంతకు ముందే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంటిముఖం పట్టే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఇమ్రాన్‌కు మద్దతు ఇచ్చే ఎంక్యూఎం పీ పార్టీ సభ్యులే కాదు.. ఏకంగా సొంత పార్టీ సభ్యులు కూడా 12 మంది ఈ అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అందువల్ల ఇక పాక్ ప్రధాని పదవికి ఇమ్రాన్ ఖాన్ రాజీనామాయే మిగిలింది. ఇలాంటి సమయంలో పాక్ తదుపరి ప్రధాని ఎవరన్న కుతూహలం కలగొచ్చు.. అయితే.. పాక్ తదుపరి ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ అని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చెబుతోంది. ఈ మేరకు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో ప్రకటించారు. అన్నిదారులూ మూసుకపోయిన నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ గౌరవప్రదంగా తప్పుకుంటే అన్నివిధాలా బావుంటుందన్న టాక్ వినిపిస్తోంది.