దేశ ద్రోహ చట్టం.. సెడిషన్‌ లా.. ఈ దేశంలో దశాబ్దాల తరబడి దుర్వినియోగానికి గురవుతున్న చట్టం.. రాజద్రోహం అనే నేరం కింద.. ఎవరినైనా అరెస్టు చేసే హక్కును రాజ్యానికి కట్టబెట్టిన చట్టం ఇది. ఇది మన చట్టం కాదు.. ఎప్పుడో బ్రిటీష్ హయాంలో మన నాయకులను కట్టడి చేసేందుకు రూపొందించిన చట్టం.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లయినా ఇంకా ఇలాంటి చట్టాలు అమలులోనే ఉంటున్నాయి. అధికార దుర్వినియోగానికి ఆస్కారం ఇస్తూనే ఉన్నాయి.


ఇటీవల ఈ చట్టంపై విచారించిన సుప్రీం కోర్టు కేంద్రాన్ని తీవ్రంగా మందలిచింది. ఈ చట్టంపై మీరు నిర్ణయం తీసుకుంటారా మమ్మల్ని తీసుకోమంటారా అని ప్రశ్నించింది. దీంతో ఇప్పుడు కేంద్రం పునరాలోచనలో పడింది. ఇప్పటికే అనేక కాలం చెల్లిన చట్టాలను రద్దు చేశామని ఘనంగా చెప్పుకుంటున్న మోడీ సర్కారు ఈ రాజద్రోహం చట్టం గురించి మాత్రం ఇంకా ఆలోచనలోనే ఉంది. అయితే.. ఇప్పుడు  దేశద్రోహచట్టంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.


దేశద్రోహ చట్టాన్ని పునః పరిశీలించాలని నిర్ణయించినట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం తాజాగా తెలిపింది. తాము నిర్ణయం తీసుకునేవరకూ దేశద్రోహ చట్టానికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై తీర్పును ఆపాలని కోరింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా పాతకాలపు చట్టాలను రద్దు చేయాలని కేంద్రం ఇటీవల నిర్ణయించింది. అందులో భాగంగానే దేశ ద్రోహ చ ట్టాన్ని కూడా రద్దు చేయాలని మొదట భావించారు. కానీ ఆ చట్టాన్ని మళ్లీ సమీక్షిస్తామ ని అందులోని లోపాలను సరిదిద్దుతామని తాజాగా ప్రవేశపెట్టిన అఫిడవిట్ లో కేంద్రం వెల్లడించింది.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారిపై ఇటీవల దేశద్రోహ చట్టం నమోదు చాలా ఎక్కువైంది. ఈ చట్టం దుర్వినియోగమవుతోందని గతేడాదే సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. బ్రిటీష్ కాలంలో నాటి చట్టాన్ని కేంద్రం ఇంకా ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించింది. ఇప్పుడు కేంద్రం ఏంచేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. రాజద్రోహం చట్టాన్ని పూర్తిగా రద్దు చేస్తుందా.. లేక సవరణలతో కొనసాగిస్తుందా అన్నది తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: