మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన నినాదాన్ని తెలంగాణ ప్రజలు నిజం చేశారు. 64 స్థానాలిచ్చి అధికారాన్ని కట్టబెట్టారు. అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కంటే కూడా ఆ పార్టీకి నాలుగు స్థానాలు అదనంగానే వచ్చాయి. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలకు ప్రజలు ఆకర్షితులయ్యారు అని ఫలితాలను చూస్తే అర్థం అవుతుంది.


రేవంత్ రెడ్డి సీఎం సీఎంగా ప్రమాణం చేస్తున్నారు. అయితే తొలిసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్న రేవంత్ రెడ్డి మూడు రాష్ట్రాలను గుర్తు పెట్టుకోవాలి. అవి ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, తెలంగాణ.  ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. కిందటి సారి ఎన్నికల్లో అనేక సంక్షేమ పథకాలు ప్రకటించి ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టినా చిట్ట చివరి లబ్ధిదారుడి వద్దకు కూడా చేరగలగాలి. అప్పుడే విజయవంతమవుతుంది. కానీ ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ లో కాంగ్రెస్ ఇలా చేరవేయడంతో విఫలమైంది. ఫలితం మనం చూశాం.


తెలంగాణ విషయానికొస్తే బీఆర్ఎస్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గ్రామానికి వెళ్లాయి. కాకపోతే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన దళితబంధు, బీసీ బంధు, డబుల్ బెడ్ రూం ఇళ్లలో కమీషన్లు తీసుకున్నారని స్వయంగా కేసీఆరే ప్రకటించారు. ఇది ఓటర్ల ఆగ్రహానికి కారణం అయింది. దీంతో బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఆశలకు గండి పడినట్లయింది.


కాబట్టి ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయడంలో పక్కాప్రణాళికతో ముందుకు వెళ్లాలి. అర్హులైన ప్రతి ఒక్కరికి అందిచేలా రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి. 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల లోపు వీటిని అమలు చేయకపోతే ఎంపీ స్థానాలు తగ్గే అవకాశం ఉంది. దీనిని సాకుగా చూపి పార్టీలో సీనియర్లు రేవంత్ రెడ్డి సీఎం పదవికి ఎసరు పెడతారు. కాబట్టి ఆయన అత్యంత జాగ్రత్తగా వీటిని అమలు చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: