అధికారం కోల్పోయాక వైసీపీ అధినేత జగన్‌లో నైరాశ్యం ఆవరించినట్టు కనిపిస్తోంది. ఆయన పూర్తిగా డీలా పడిపోయినట్టు కనిపిస్తోంది. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఒకేసారి 11 సీట్లకు పడిపోవడం అంటే సాధారణ పరాజయం కాదు. ఊహించని దెబ్బతో ఎంతటివారైనా డీలా పడతారు.. నిజమే.. కానీ ఎంత కాలం.. అందులోనూ ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉంది. ఓవైపు పార్టీ నాయకులపై టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయి. మరోవైపు అధికార యంత్రాంగం వైసీపీ కార్యాలయ భవనాలు అక్రమంగా నిర్మించారంటూ జేసీబీలను వాటిపైకి పంపుతోంది.


ఇలాంటి కష్టకాలంలో నాయకుడు చాలా ధైర్యంగా ఉండాలి. పార్టీ నాయకులకు అండగా నిలబడాలి. పార్టీపై ఏ చిన్న దాడి జరిగినా ధైర్యంగా ఎదుర్కోవాలి. అవసరం అనుకుంటే ఎప్పటి కప్పుడు ప్రెస్‌ మీట్లు పెట్టి అధికార పార్టీ దాడులను ఖండించాలి. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపాలి. కానీ.. జగన్ తీరు చూస్తే అవేమీ చేస్తున్నట్టు కనిపించడం లేదు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయాన్ని అక్రమంగా నిర్మించారంటూ జేసీబీలతో నేలమట్టం చేస్తే పార్టీ నుంచి కనీస ప్రతిఘటన లేకుండాపోయింది. జస్ట.. సోషల్ మీడియాలో ఓ ఖండన ప్రకటన ఇచ్చి జగన్ పులివెందుల వెళ్లిపోయారు.


ఇదే ప్లేస్‌లో చంద్రబాబు ఉండి ఉంటే.. పరిస్థితి పూర్తిగా వేరుగా ఉండేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా సరే.. చంద్రబాబు ఇలాంటి దాడులను తీవ్రంగా ప్రతిఘటించేవారు. శక్తిమేరకు పోరాడేవారు. అవసరమైతే అన్ని వ్యవస్థలను సంప్రదించేవారు.
ఎన్ని మార్గాల్లో పోరాటం చేయాలో అన్ని మార్గాల్లో పోరాటం చేసేవారు. ఇదే తరహాలో వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగితే.. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.


చంద్రబాబు సహా నేతలంతా రోడ్లపైకి వచ్చారు. కానీ ఇప్పుడు వైసీపీలో ఆ పోరాట పటిమ కనిపించట్లేదు. ఇలాంటి సమయంలో జగన్ బయటకు వచ్చి.. గట్టిగా ప్రతిఘటిస్తే.. పార్టీ నాయకులకు ధైర్యం వస్తుంది. ప్రభుత్వంలో కూడా కాస్త మార్పు వస్తుంది. మరోసారి చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. కానీ.. జగన్‌ కనీస పోరాటం కూడా చేస్తున్నట్టు కనిపించడం లేదు. జగన్‌ ఇకనైనా మారాలి.. పోరాటం ప్రారంభించాలని వైసీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: