ఆరోగ్యానికి సంబంధించిన ఒక ప్రసిద్ధమైన సామెత మనందరికీ తెలిసిందే – “రోజుకు ఒక ఆపిల్ తింటే డాక్టర్ని దూరం పెట్టొచ్చు”. ఆపిల్ పండులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు హృదయ సంబంధిత వ్యాధులు, ముఖ్యంగా హార్ట్‌అటాక్ వంటి సమస్యలు దూరం చేసేందుకు చాలా ఉపయోగపడతాయి. అందువల్ల ఆరోగ్య నిపుణులు, వైద్యులు ఆపిల్ తినమని తరచుగా సూచిస్తుంటారు. అయితే వాస్తవం ఏమిటంటే, ఆపిల్ ధర ప్రతి ఒక్కరి స్తోమతకు అందదు. అందుకే మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కొనలేరు. కానీ ఆపిల్‌తో సమానంగా లేదా దానికంటే ఎక్కువ పోషకాలు కలిగిన పండు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!


ఆ పండు మరేదో కాదు, మనందరికీ బాగా తెలిసిన జామపండు. జామపండును చాలా మంది “మధ్యతరగతి ఆపిల్” అని పిలుస్తారు. జామపండు తక్కువ ధరలో లభించడమే కాకుండా విటమిన్‌ సి, విటమిన్‌ ఏ, పొటాషియం, ఫైబర్ వంటి అనేక పోషకాలను పుష్కలంగా కలిగి ఉంటుంది. రోజూ ఒకటి లేదా రెండు జామపండ్లు తింటే శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు దాదాపు అందుతాయి. డాక్టర్లు కూడా పలు సందర్భాల్లో జామపండు ప్రాముఖ్యతను ప్రత్యేకంగా చెబుతారు. అయినా మనలో చాలామంది ఆపిల్‌ను ప్రాధాన్యంగా భావించి బహుమతిగా ఇవ్వడానికో, పేషెంట్లను చూడడానికి వెళ్తే ఆపిల్‌ను తీసుకెళ్లడానికో అలవాటు చేసుకున్నాం. కానీ ఆరోగ్య పరంగా జామపండు ఆపిల్‌కు ఏమాత్రం తీసిపోదు.  పైగా, కొంత విషయంలో మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.


జామపండు మాత్రమే కాదు, ఇంకా అనేక పండ్లు కూడా మన ఆరోగ్యానికి అపారమైన లాభాలను అందిస్తాయి.

బెర్రీలు: స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్బెర్రీ వంటి బెర్రీ పండ్లు యాంటీ ఆక్సిడెంట్లలో అగ్రస్థానంలో ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని కాపాడటంలో, వృద్ధాప్యాన్ని ఆలస్యంగా రావడంలో సహాయపడతాయి. కొంచెం ఖరీదైనప్పటికీ, వీటిలో ఉండే పోషక విలువలు చాలా ఎక్కువ.

పపాయ (బొప్పాయి): విటమిన్ ఏ, సి పుష్కలంగా ఉండే ఈ పండు జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఇది చర్మానికి కాంతిని తెచ్చే పండు కూడా.

కివి: చిన్నదైన ఈ పండు విటమిన్ సి లో అగ్రస్థానంలో ఉంటుంది. ఆపిల్ కంటే మూడు, నాలుగు రెట్లు ఎక్కువ విటమిన్ సి కలిగిన ఈ పండు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

అరటిపండు: తక్కువ ధరలో లభించే ఈ పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది హృదయ ఆరోగ్యాన్ని కాపాడటంలో, శక్తిని తక్షణం అందించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

దానిమ్మ (పోమెగ్రానేట్): రక్తహీనతను తగ్గించడంలో, రక్తపోటును నియంత్రించడంలో, వృద్ధాప్యాన్ని ఆలస్యంగా రానివ్వడంలో ఈ పండు కీలక పాత్ర పోషిస్తుంది.

అందువల్ల పండ్లలో ప్రతి ఒక్కదానికి ప్రత్యేకమైన పోషకాలు, ప్రయోజనాలు ఉంటాయి. అయితే అందరికీ సులభంగా అందుబాటులో ఉండేది జామపండు. ప్రతిరోజూ కనీసం ఒక జామపండు తినడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్‌లు, ఖనిజాలు సులభంగా లభిస్తాయి. వ్యాధులు దరిచేరకుండా ఉండేందుకు, రోగనిరోధక శక్తిని పెంచేందుకు జామపండు ఒక సహజ ఔషధంలాంటిది.



ఆపిల్‌ను ఒక రిచ్‌ ఫ్రూట్‌గా భావించే మన ధోరణి తప్పేమీ కాదు, కానీ ఆరోగ్య పరంగా ఆపిల్‌కు సమానంగా నిలిచే పండు మనందరికీ అందుబాటులోనే ఉంది. జామపండు అందరికీ తక్కువ ఖర్చుతో లభించే పండు. ఇది కేవలం తీపి రుచి మాత్రమే కాదు, ఒక ఆరోగ్య భాండాగారం. డాక్టర్లు కూడా “రోజుకు ఒక జామపండు తింటే ఆరోగ్యం పటిష్ఠంగా ఉంటుంది” అని చెబుతారు. అందువల్ల పండ్లు తినడం ఒక ఖరీదు విషయం అని కాకుండా, మన పరిధిలో లభించే పండ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని గుర్తుంచుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: