
పగిలిన పెదాలు ఎన్నో కారణాల వల్ల వస్తాయి. పెదాలను సరిగ్గా చూసుకోకపోవటం, డీహైడ్రేషన్, వాతావరణంలో మార్పులు, విటమిన్ల లోపం, పొగ త్రాగటం వంటివి వాటిలో కొన్ని. అయితే పెదాలను జాగ్రత్తగా చూసుకుంటే తిరిగి అందంగా, మృదువుగా మార్చుకోవచ్చు. దీని కోసం కింద తెలిపిన చిట్కాలను పాటించండి.
మన శరీరంలో నీరు తగ్గటం వల్ల డీహైడ్రేషన్ అవుతుంది. దీనివల్ల పెదాలు పగిలి, పొడిబారిపోతాయి. అందుకే రోజుకు కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరు తాగాలి. ఇది మీ శరీరాన్ని, పెదాలను తేమగా ఉంచేందుకు సహాయపడుతుంది. అలాగే పండ్ల రసాలు, కొబ్బరి నీరు కూడా తాగవచ్చు. సూర్యరశ్మి నుండి రక్షించేందుకు కనీసం 30 SPF కలిగిన లిప్ బామ్ ఉపయోగించాలి. సూర్యరశ్మి పెదాల మీద నేరుగా పడకుండా చూసుకోవాలి. తేమగా ఉంచేందుకు షియా బటర్, కొబ్బరి నూనె, విటమిన్ ఇ, పెట్రోలియం జెల్లీ వంటి పదార్థాలు కలిగిన లిప్ బామ్ ను ఎంచుకోండి. బయటకు వెళ్లేటప్పుడు, పడుకునే ముందు లిప్ బామ్ రాసుకోవడం మంచిది.
పెదాలపై ఉండే పొడి చర్మాన్ని తొలగించడానికి ఎక్స్‌ఫోలియేషన్ అవసరం. కొద్దిగా తేనె, పంచదార కలిపి పెదాలపై సున్నితంగా రుద్దండి. ఇది పగిలిన పెదాలను తొలగించి, పెదాలు మృదువుగా ఉండేందుకు సహాయపడుతుంది. ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేయండి. తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పెదాలను నయం చేసి, మృదువుగా చేస్తాయి. కొద్దిగా తేనెను పెదాలకు రాసి 15 నిమిషాల తర్వాత కడిగేయండి
కొబ్బరి నూనె పెదాలకు గొప్ప మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. పడుకునే ముందు కొద్దిగా కొబ్బరి నూనెను పెదాలకు రాసుకోండి. అలోవెరాలో ఉండే యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు పగిలిన పెదాలను నయం చేస్తాయి. ఫ్రెష్ అలోవెరా జెల్ ను పెదాలకు రాసి 10 నిమిషాల తర్వాత కడిగేయండి. ఈ చిట్కాలను పాటించడం ద్వారా పగిలిన పెదాలను మృదువుగా, అందంగా మార్చుకోవచ్చు. ఒకవేళ సమస్య ఎక్కువైతే చర్మ వైద్య నిపుణుడిని సంప్రదించండి.