
తునిలో ఆరుసార్లు విజయం సాధించిన యనమల 2014 ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పుకుని, తన సోదరుడు కృష్ణుడుకు తుని టికెట్ ఇప్పించుకున్నారు. కానీ 2014, 2019 ఎన్నికల్లో కృష్ణుడు టీడీపీ తరుపున పోటీ చేసి వరుసగా దాడిశెట్టి రాజా చేతిలో ఓడిపోతున్నారు. ఏదో 2014లో టీడీపీ అధికారంలోకి రావడం, యనమలకు మంత్రి పదవి దక్కడంతో కాస్త ఆ ఫ్యామిలీకి ఊరట వచ్చింది గానీ, 2019 నుంచి తునిలో యనమల ఫ్యామిలీకి చుక్కలు కనబడుతున్నాయి. ఇక్కడ మళ్ళీ యనమల ఫ్యామిలీకి గెలిచే అవకాశాలు అసలు ఉన్నట్లు కనిపించడం లేదు.
అటు రాజా వైసీపీ ఎమ్మెల్యేగా దూసుకెళుతున్నారు. తునిలో పార్టీలకు అతీతంగా పథకాలు అందిస్తూ, ప్రజల మద్ధతు పెంచుకుంటున్నారు. తునిలో కొత్తగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, సిసి రోడ్లు, రైతు బజార్లు, వాటర్ కనెక్షన్లు, నాడు-నేడు ద్వారా పాఠశాలలు అభివృద్ధి చెందడం, జగనన్న కాలనీల ద్వారా పేదలకు ఇళ్ళు నిర్మించే కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఇలా రాజకీయంగా కూడా రాజా బలపడ్డారు. స్థానిక ఎన్నికల్లో తునిలో యనమల అడ్రెస్ గల్లంతు చేశారు. పైగా రాజాకు జగన్ నెక్స్ట్ మంత్రి పదవి కూడా ఇచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. ఇక మంత్రి పదవి కూడా వస్తే తునిలో రాజాని ఢీకొట్టడం యనమల ఫ్యామిలీకి కష్టమే. మరి రాజాకు జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారో లేదో చూడాలి.