ఇండియన్‌ సినిమా అంటే ముందుగా ‘హిందీ సినిమా’ గుర్తొచ్చేది. ఆ తరవాతే.. దక్షిణాది.జీరో నుంచి హీరోగా ఎదగడమే విజయం అనుకొంటే శాండిల్‌ వుడ్‌... అలాంటి హీరోయిజమే చూపించింది. నిన్నా మొన్నటి వరకూ కన్నడ చిత్రసీమ అంటే అందరికీ చిన్నచూపే. దక్షిణాదిలో తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల తరవాతే... కన్నడ సినిమా గురించి మాట్లాడుకొనే వారు. లో- బడ్జెట్‌ చిత్రాలనీ, క్వాలిటీ బాగోవని, కథ విషయంలో నవ్య రీతిలో ఆలోచించలేరని ఎన్ని రకాల అవమానాలు ఎదుర్కొందో. ఇప్పుడు కథ మారింది. శాండిల్‌వుడ్‌ సుగంధాలు దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల హృదయాల్ని తాకుతున్నాయి. దేశమంతా ఇప్పుడు కన్నడ సినిమా వైపు చూస్తోంది. ఓ రకంగా దక్షిణాది చిత్రసీమకు ఇవి గర్వించదగిన క్షణాలు.ఇండియన్‌ సినిమా అంటే ముందుగా ‘హిందీ సినిమా’ గుర్తొచ్చేది. ఆ తరవాతే.. దక్షిణాది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రసీమలన్నింటినీ కలిపి ‘సౌత్‌’ అంటూ ఒకే గాడిన కట్టేశారు. నిజానికి దక్షిణాదిలో ఉన్న వైవిధ్యం అప్పట్లో బాలీవుడ్‌ కళ్లకు ఆనలేదు. తెలుగు సినిమా ఒకలా ఉంటుంది. తమిళ వాసన వేరు. మలయాళ సినిమా గాంభీర్యం వేరు. కన్నడ టేస్టు వేరు. తెలుగులో హీరోయిజం ఎక్కువ. తమిళ నాట... ఊర మాస్‌ సినిమాలొస్తుంటాయి. మలయాళంలో ప్రయోగాలకు పెద్ద పీట వేస్తుంటారు. వీటి మఽధ్య కన్నడ చిత్రసీమ తనదంటూ ప్రత్యేకతని సంపాదించలేకపోయిందన్నది నిజం. అక్కడ బడ్జెట్లు చాలా తక్కువ. స్టార్‌ హీరో సినిమా అంటే మహా అయితే పది కోట్లలో తీసేయాలి. ఎందుకంటే అక్కడ మార్కెట్లు కూడా అంతంత మాత్రంగానే ఉండేవి. కన్నడ సినిమా అంటే నిన్నా మొన్నటి వరకూ ఉపేంద్ర లాంటి ఒకరిద్దరు గుర్తొచ్చేవారు. తను నటించిన ‘ఏ’, ‘ఉపేంద్ర’, ‘సూపర్‌’ సినిమాలు తెలుగు నాట మంచి వసూళ్లు సాధించాయి. ఉపేంద్రని కూడా ఓ తెలుగు నటుడిలానే చూడడం మొదలెట్టారు. ఉపేంద్ర మినహాయిస్తే.. అక్కడి నుంచి తెలుగులోకి వచ్చి కాస్తో కూస్తో వసూళ్లు సంపాదించుకొన్న వాళ్లని వేళ్ల మీద లెక్క గట్టొచ్చు.కన్నడలో కథల కొరతో, మరోటో తెలీదు గానీ... మిగిలిన భాషల సినిమాల్ని అక్కడ రీమేకులుగా తీయడానికి ఎక్కువ ఉత్సాహం చూపించేవారు. తెలుగులో సూపర్‌ హిట్టయిన ప్రతీ సినిమా కన్నడలో రీమేక్‌ అయ్యింది. మనం ‘మగధీర’ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తే... అక్కడ అదే కథని చాలా లో బడ్జెట్‌తో తీసేశారు. దాంతో.. మీమర్లు.. రెండు మగధీరల్నీ పోలుస్తూ కావల్సినంత కామెడీ చేసుకొనేవారు. ఇక్కడ రాజమౌళి వాడిన గ్రాఫిక్స్‌ ‘ఆహా..’ అనిపిస్తే.. కన్నడలో ‘ఇంతేనా’ అని నవ్వుకొనేలా తీశారు. మనకు ఇదంతా కామెడీగా అనిపించొచ్చు కానీ... అప్పటికి కన్నడ పరిస్థితి అంతే. అక్కడ బడ్జెట్లు లేవు. వసూళ్లు రావు. అలాంటప్పుడు కోట్లు పోసి ఖరీదైన సినిమాలు ఎలా తీయగలరు?అయితే ‘కేజీఎఫ్‌’తో లెక్కలు మొత్తం మారిపోయాయి. ఆ సినిమా దేశ వ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని అందుకొంది. పాత రికార్డులన్నీ బద్దలు కొట్టేసింది. కన్నడ చిత్రసీమ స్టామినా ఎంతో రుచి చూపించింది. నిజానికి ‘కేజీఎఫ్‌’ అనే సినిమా తీస్తున్నప్పుడు దానిపై ఎవరికీ ఎలాంటి నమ్మకాలూ లేవు. ఈ సినిమాపై భారీ పెట్టుబడి పెడుతుంటే... అదంతా ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ అనుకొన్నారు. కానీ ‘కేజీఎఫ్‌’ వచ్చింది.. చరిత్ర సృష్టించింది. కన్నడ చిత్రసీమ రూపు రేఖల్ని మార్చేసింది. కన్నడ సినిమా స్టామినా ఏమిటో ప్రపంచానికి తెలిసేలా చేసింది. ‘కేజీఎఫ్‌ 2’ రెండాకులు ఎక్కువే చదివింది. ‘కేజీఎఫ్‌’ వసూళ్లని దాటేసింది. నార్త్‌ బెల్ట్‌లో కేజీఎఫ్‌ వసూళ్లు చూసి బాలీవుడ్‌ ప్రముఖులే ఆశ్చర్యపోయారు. ‘బాహుబలి’, ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’, ‘పుష్ప’లతో... టాలీవుడ్‌ షాకిస్తే... ‘కేజీఎఫ్‌’తో కన్నడ సీమ అంతకంటే పెద్ద షాకిచ్చింది. కంటెంట్‌ బాగుంటే ఎంతైనా ఖర్చు పెట్టొచ్చని, దాన్ని తిరిగి రాబట్టుకొనే శక్తి ‘సినిమా’కి ఉందని ఈ చిత్రాలన్నీ నిరూపించాయి. సుదీప్‌ ‘విక్రాంత్‌ రోణ’ కూడా కన్నడ చిత్రసీమలో భారీ విజయాన్ని అందుకొంది. తెలుగులోనూ ఆ సినిమాకి మంచి వసూళ్లు దక్కాయి.

‘కాంతార’ది మరో అధ్యాయం. రిషబ్‌ శెట్టి కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ఇది. ‘కేజీఎఫ్‌’లానే ‘కాంతార’పైనా ఎవరికీ నమ్మకాల్లేవు. ప్రొడక్షన్‌ దశలో ఈ సినిమాని ఎవరూ పట్టించుకోలేదు కూడా. అంతెందుకు... చిత్రబృందమే దీన్ని ‘పాన్‌ ఇండియా’ సినిమా అనుకోలేదు. ముందు కన్నడలో రిలీజ్‌ చేశారు. అక్కడ అనూహ్యమైన స్పందన రావడంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమాని చూపించారు. ఇప్పుడు ‘కాంతార’ వసూళ్లు రెండొందల కోట్లు దాటేశాయి. రూ.16 కోట్లతో రూపొందిన ఈ సినిమా రూ.200 కోట్లు అందుకోవడం నిజంగా ట్రేడ్‌ పరంగా ఓ అద్భుతం. తెలుగులో గీతా ఆర్ట్స్‌ ఈ సినిమాని రూ.5 కోట్లకు కొంటే వాళ్లకు ఏకంగా రూ.20 కోట్ల లాభాలొచ్చాయి. రిషబ్‌ శెట్టి ఇది వరకు తీసిన ‘గరుడ గమన రుషబ వాహన’ కూడా కన్నడలో పెద్ద హిట్‌గా నిలిచింది. అక్కడ ఈ సినిమాకి క్లాసిక్‌గా అభివర్ణిస్తుంటారు. త్వరలోనే ఉపేంద్ర సినిమా ‘కబ్జా’ రాబోతోంది. దీన్ని కూడా భారీగా ఖర్చు పెట్టి పాన్‌ ఇండియా స్థాయిలో తీశారు. ఇటీవలే టీజర్‌ విడుదల చేశారు. కబ్జాపై కేజీఎఫ్‌ ముద్ర ఉందన్న విషయం టీజర్‌లో తేలిపోయింది. ఈ సినిమాలన్నీ కన్నడ చిత్రసీమ స్థాయిని పెంచడమే కాదు, అక్కడి నిర్మాతలకు, నటీనటులు సాంకేతిక నిపుణులకు కొండంత భరోసా కలిగించాయి. కంటెంట్‌లో బలముంటే పాన్‌ ఇండియా స్థాయిలో జెండా ఎగరేయొచ్చన్న నమ్మకాన్ని కలిగించాయి. ‘బనారస్‌’ అనే ఓ లవ్‌ స్టోరీ నవంబరు 4న పాన్‌ ఇండియా స్థాయిలోనే విడుదల అవుతోంది. ఈ సినిమా కూడా క్లిక్‌ అయితే... కన్నడ శోభ మరింత విస్తరిస్తుంది.

వసూళ్లూ, లాభాలు.. ఈ మాట పక్కన పెడితే కన్నడ సంస్కృతి, సంప్రదాయాలు దేశ వ్యాప్తంగా తెలియడానికి ఈ చిత్రాలు దోహదం చేశాయి. ముఖ్యంగా ‘కాంతార’ ద్వారా భూత్‌ కోలా కళ వెలుగులోకి వచ్చింది. ‘కాంతార’ విడుదలైన తరవాత భూత్‌ కోలా కళాకారులకు పెన్షన్లు ఇచ్చే ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇదంతా సినిమా సాధించిన విజయమే. తెలుగు, తమిళ, మలయాళ చిత్రసీమల నుంచి వందల కోట్ల విలువైన సినిమాలొస్తున్నాయి. ఇప్పుడు కన్నడ కూడా తోడైంది. బాలీవుడ్‌ని మించే స్టఫ్‌ సౌత్‌ ఇండియన్‌ సినిమాలు ఇవ్వగలవని ఇప్పటికే నిరూపితమైపోయింది. ఇక మీదట ఇండియన్‌ సినిమా అంటే.. ఇండియన్‌ సినిమానే. ఇప్పుడు భాషా బేధాలు, ప్రాంతీయ బేధాలు లేనే లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: