తెలుగు సినిమాకు ఒక‌ చరిత్ర ఉంది. వెనక్కి చూస్తే ఎన్నో రికార్డులు కూడా ఉన్నాయి. టాలీవుడ్ భారతీయ సినిమాకు కూడా స్పూర్తిని ఇచ్చేదిగా ఉంటూ వచ్చింది. ఇక దేశంలో అత్యధిక సినిమాలు కూడా టాలీవుడ్ లో నిర్మాణం అవుతాయి. టాలీవుడ్ అంటే బాలీవుడ్ కూడా తొంగి చూసే పరిస్థితి ఉంది.

అయితే కరోనా మహమ్మారి రెండు సార్లు వరసపెట్టి మీదపడిపోయింది. టాలీవుడ్ ని అతలాకుతలం చేస్తోంది. మొదటిసారి కరోనా వచ్చినపుడే ఓటీటీ ఫ్లాట్ ఫారం రెక్కలు విప్పుకుంది. నాడు చాలా సినిమాల మీద గేలం వేసింది. అయితే ఏ ఒక్క బొమ్మ కూడా ఓటీటీ కి చిక్కలేదు. చిన్నా చితకా సినిమాలకే ఓటీటీ తీసుకోవాల్సి వచ్చింది. ఓటీటీ భారీ ఆఫర్లు ఇచ్చిన సినిమాలు అక్కడ నో చెప్పి థియేటర్లలో రిలీజ్ అయి బొక్క బోర్లా పడ్డాయి. దాంతో ఓటీటీకే  వాటిని ఇచ్చి ఉంటే బాగుండేది అన్న మాట కూడా వినిపించింది.

ఒక విధంగా దాన్ని గుణపాఠంగా తీసుకుని ఈసారి అయినా దారికి వస్తారు అనుకుంటే సెకండ్ వేవ్ లో కూడా ఓటీటీకి తీవ్ర నిరాశ ఎదురవుతోందిట. అదిరిపోయే ఆఫర్లు ఇచ్చినా కూడా మేకర్స్  ఓటీటీకి నో చెప్పేస్తున్నారుట. ఇందులో ఏడాదికి పైగా రిలీజ్ కోసం వెయిట్ చేస్తూ మురిగిపోయిన యువ హీరోల సినిమాలు చాలానే  ఉన్నాయి. అలాగే సినిమా షూటింగులు పూర్తి చేసుకుని రెడీ టూ రిలీజ్ అన్న సినిమాలూ ఉన్నాయట. పాన్ ఇండియా మూవీస్ కి అయితే ఓటీటీ లాభసాటి కాదు కానీ ఇలాంటి సినిమాలకు పక్కాగా చాన్స్ ఉంది.

పైగా మంచి ఆఫర్. రిలీజ్ చేసేస్తే బాగుంటుంది అన్న వారూ ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కర్ఫ్యూలు, లాక్ డౌన్ లతో జనాలు కూడా ఇళ్ళల్లో ఉన్నారు. ఈ టైమ్ లో ఓటీటీలో బొమ్మ పడితే సూపర్ హిట్ అవుతుంది. అయినా సరే నో వే అంటూ చాలా సినిమాలు చెట్టెక్కి కూర్చున్నాయిట. ఈ పరిణామంతోనే ఓటీటీ నిర్వాహకులు డీలా పడుతున్నారుట. ఇది పక్కన పెడితే మరీ ఇంత ధీమా ఏంటి బాబూ అన్న చర్చ కూడా మొదలైంది.

థియటర్లోనే సినిమా అంటున్నారు. కానీ ఇపుడున్న కరోనా ఉధృతంలో చూసుకుంటే మరో మూడు నెలల దాకా సినిమా హాళ్ళు తెరచుకుంటాయన్న నమ్మకం లేదు అంటున్నారు. ఆ మీదట సెప్టెంబర్ లో మూడవ వేవ్ కూడా అంటున్నారు. అంటే టోటల్ గా ఈ ఏడాది కి సినిమా హాల్స్ తెరచుకునే సీన్ ఉంటుందా అన్న చర్చ కూడా ఉంది. అలాంటపుడు ఓటీటీలలోనే రిలీజ్ చేసుకోవడం మంచిదే కదా అన్న వాదన కూడా వినిపిస్తోంది. కానీ థియేటర్లలోనే బొమ్మ పడాలి అని చాలా మంది పట్టుబట్టి కూర్చున్నారు. ఎంతకాలమైనా అంటున్నారు. ఒక విధంగా చూస్తే టాలీవుడ్ లో అతి ధీమా  పెరిగిపోయిందా అన్నదే చర్చట.






మరింత సమాచారం తెలుసుకోండి: