‘బాహుబలి’ సమయంలో రాజమౌళి ‘కిరికిరి’ భాషను సృష్టిస్తే జనం తెగ ఎంజాయ్ చేసారు. వాస్తవానికి మన తెలుగు రాష్ట్రాలలో జనం మాట్లాడే భాష తెలుగే అయినప్పటికీ ఒకొక్క ప్రాంతంలో ఒక మాండలికం ఉంటుంది. స్పష్టమైన తెలుగు భాషను మాట్లాడే కోస్తా ప్రాంతం ప్రజలు తెలంగాణ మాండలికాన్ని తెగ ఎంజాయ్ చేస్తారు.


అదేవిధంగా నెల్లూరు యాస  ఉత్తరాంద్ర యాసలతో చాల సినిమాలు వచ్చాయి. ఇలాంటి సినిమాలలో నటీనటులు చెప్పిన డైలాగ్స్ ను ప్రేక్షకులు అనేకసార్లు ఎంజాయ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు దర్శకుల దృష్టి చిత్తూరి యాస పై పడింది. ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ లో నాని చిత్తూరు యాసలో డిఫరెంట్ గా నటించినా ఆ సినిమా జనంకు పెద్దగా నచ్చకపోవడంతో ఆ భాష గురించి పెద్దగా మాట్లాడుకోలేదు.


అయితే లేటెస్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ‘సినిమా బండి’ మూవీలోని యాస మాత్రం జనానికి విపరీతంగా నచ్చింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈమూవీని చిత్తూరు ప్రాంతానికి చెందిన బాలీవుడ్ దర్శకుడు రాజ్ - డీకే లు నిర్మిస్తే అదే ప్రాంతానికి చెందిన ప్రవీణ్ కంద్రేగుల ఈమూవీకి దర్శకత్వం వహించాడు. దీనితో వీరిద్దరికీ ఆప్రాంతంలోని భాష పై ఉండే మక్కువతో ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులు వినని చిత్తూరు యాస, మాండలికాలతో నిండిన ‘సినిమా బండి’ జనంకు విపరీతంగా కనెక్ట్ అవుతోంది.  ‘నీకేం పని లేదా’ అనే మాటను ఆ ప్రాంతంలో ‘నీకేం పంగ లేదా’ అంటారు. ఇలాంటి కొత్త మాటలు చాలానే ఈ సినిమాలోవినిపిస్తున్నాయి.


వాస్తవానికి ఈ పదాలకు అర్థాలు చాలామందికి తెలియకపోయినా ఇప్పుడు ఈమూవేలోని డైలాగ్స్ ను జనం విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ‘సినిమా బండి’ కి ఇలాంటి పరిస్థితి ఉంటే పూర్తి చిత్తూరు యాసతో నిండిపోబోతున్న ‘పుష్ప’ మూవీలోని డైలాగ్స్ ఎంత సంచలనాలు సృష్టిస్తాయో అంటూ బన్నీ అభిమానులు ఇప్పటి నుండే ‘పుష్ప’ పై అంచనాలు పెంచుకుని సంబరపడుతున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: