స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఇప్పుడు నిర్మాతగానూ మారింది. తన సొంత నిర్మాణ సంస్థ 'ట్ర లా లా మూవింగ్ పిక్చర్స్' బ్యానర్‌పై తొలి చిత్రాన్ని నిర్మించింది. ఆ సినిమా పేరే 'శుభం'. ఇది మే 9వ తేదీ శుక్రవారం నాడు థియేటర్లలో విడుదల కానుంది.

'శుభం' సినిమాలో నటీనటులుగా హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, శ్రీయ కొంతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి, వంశీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు.

సినిమా ప్రచారంలో భాగంగా చిత్ర యూనిట్ ఇటీవల వైజాగ్‌లో ఘనంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ వేడుకలో చిత్ర బృందం తమకు సమంత తొలి ప్రొడక్షన్ లో భాగం కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. కొత్త టాలెంట్‌ను, మంచి కథలను ప్రోత్సహిస్తున్న సమంతపై ప్రశంసలు కురిపించారు.

ఈ ఈవెంట్‌లో దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల మాట్లాడుతూ ఈ సినిమాపై పని చేయడం పట్ల తన ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేశారు. చిత్ర బృందం అంతా ప్రేక్షకులకు కొత్తగా, వినోదాత్మకంగా ఉండే చిత్రాన్ని అందించడానికి ఎంతో కష్టపడిందని చెప్పారు.

ఈ వేదికపై సమంత మాట్లాడుతూ.. 'శుభం' సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని తెలిపింది. వైజాగ్ వస్తే తనకు ఎప్పుడూ అదృష్టం కలిసి వస్తుందని, ఇక్కడ తన సినిమాలకు ప్రచారం చేస్తే అవి ఎప్పుడూ బాగా ఆడుతాయని చెప్పింది. అందుకే తన తొలి ప్రొడక్షన్ సినిమా 'శుభం' కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని, "మళ్లీ నాకు బ్లాక్ బస్టర్ ఇస్తారనుకుంటున్న" అంటూ కామెంట్ చేసింది. తన ప్రయాణం అభిమానుల నిరంతర ప్రేమ, మద్దతు లేకుండా సాధ్యం కాదని, వారందరికీ ధన్యవాదాలు తెలిపింది.

తన నిర్మాణ సంస్థ 'ట్ర లా లా మూవింగ్ పిక్చర్స్' గురించి సమంత వివరిస్తూ.. తెరపైకి కొత్త, విభిన్నమైన కథలను తీసుకురావడానికి, కొత్త టాలెంట్‌కు అవకాశాలు ఇవ్వడానికి ఈ బ్యానర్‌ను ప్రారంభించినట్లు చెప్పింది. ప్రజల హృదయాలకు హత్తుకునేలా సినిమాలు చేయాలనీ, కేవలం వినోదాన్నే కాకుండా ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసేలా సినిమాలు చేయడమే తన లక్ష్యమని పేర్కొంది.

'శుభం' సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా ఒక మంచి అనుభూతిని అందిస్తుందని సమంత హామీ ఇచ్చింది. "ఈ సినిమా చూసిన తర్వాత మీరు నవ్వుతూ, సంతోషంగా థియేటర్ నుంచి బయటకు వస్తారు" అని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: