మెగాస్టార్ చిరంజీవి... పేరు వింటేనే థియేటర్లు దద్దరిల్లిపోవాలి! కానీ గ‌త కొన్ని సినిమాలు ఆ అంచనాలను అందుకోలేక‌పోయాయి. బాక్సాఫీస్ వద్ద ఎదురుదెబ్బలు తగిలినా, మెగాస్టార్ మసాలా తగ్గలేదు, అసలు సిసలు దమ్మున్న కథతో మళ్లీ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆయన నటిస్తున్న సోషియో-ఫాంటసీ మూవీ విశ్వంభరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, మెగా157 అనిల్ రావిపూడి సినిమాకు ముందు ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఇటీవల విడుదలైన టీజర్, విశ్వంభరపై అంచనాలను పెంచింది. ముఖ్యంగా విజువల్స్, అద్భుతమైన ప్రపంచం అందరి దృష్టిని ఆకర్షించాయి. అయితే, వీఎఫ్ఎక్స్ విషయంలో కొన్ని ప్రతికూల స్పందనలు రావడంతో, మూవీ యూనిట్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ టీమ్‌ను మార్చి, కొత్త వారికి బాధ్యతలు అప్పగించింది. సోషియో-ఫాంటసీ కథాంశం కావడంతో, విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు ప్రాణం పోస్తాయి. చాలా ఏళ్ల తర్వాత చిరు నుంచి వస్తున్న సోషియో-ఫాంటసీ మూవీ కావడంతో, విశ్వంభరపై అభిమానుల్లోనూ, సినీ ప్రియుల్లోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. మెగాస్టార్ అంటేనే అభిమానులకు ఒక పూనకం. ఆయన తెరపై అడుగు పెడితే చాలు, థియేటర్లలో కేకలు, ఈలలు మార్మోగాలి. ఈ సినిమాలో అలాంటి మాస్ మూమెంట్స్ పుష్కలంగా ఉంటాయని యూనిట్ చెబుతోంది.



ఐదుగురు అందగత్తెలు - ఇదిలా ఉండగా, ఇటీవల దర్శకుడు వశిష్ట ఒక ఇంటర్వ్యూలో విశ్వంభర సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమాలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారని వశిష్ట ఖరారు చేశారు. మెగాస్టార్ సరసన ఐదుగురు భామలు అంటేనే అభిమానులకు పండగే! అందులో త్రిష లీడ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆషికా రంగనాథన్ సెకండ్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. మిగిలిన ముగ్గురు కథలో భాగంగా కీలక పాత్రలు పోషిస్తారని, ఈ ఐదుగురు హీరోయిన్లూ సినిమాకు కొత్తదనాన్ని తీసుకొస్తారని వశిష్ట స్పష్టం చేశారు. చిరుతో ఐదుగురు హీరోయిన్లు అంటే తెరపై గ్లామర్ పండగ ఖాయం. ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉండేలా చూసుకున్నామని, కేవలం అందానికే కాదు, నటనకు కూడా ప్రాధాన్యత ఉంటుందని వశిష్ట అన్నారు.


"అవతార్"తో పోలిక - వశిష్ట క్లారిటీ..  విశ్వంభర సినిమాను "అవతార్"తో పోలుస్తున్న విషయంపై కూడా దర్శకుడు వశిష్ట స్పందించి క్లారిటీ ఇచ్చారు. సినిమాలో విజువల్స్ ఆ కామెంట్స్‌కు కారణమై ఉంటాయని, కానీ విశ్వంభర కథ, ఆ సినిమా కోసం తాను సృష్టించిన ప్రపంచం మొత్తం వేరే అని స్పష్టం చేశారు. ఈ సినిమా విడుదల ఆలస్యం కావడానికి కారణం విజువల్ ఎఫెక్ట్స్ వర్క్సేనని ఆయన పేర్కొన్నారు. వీఎఫ్ఎక్స్ విషయంలో రాజీ పడకూడదని, అత్యుత్తమ నాణ్యతతో సినిమాను అందించాలని చిరంజీవి స్వయంగా వశిష్టకు సూచించారట.



అనిల్ రావిపూడితో మెగాస్టార్ చేస్తున్న మెగా157 కథకు, విశ్వంభర సినిమా చాలా భిన్నంగా ఉంటుందని, తాము తీసిన సినిమాపై తాను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నామని, ఎక్కడా ఎలాంటి ప్రెజర్ ఫీలవడం లేదని వశిష్ట చెప్పారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న విశ్వంభ‌రకు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయి, వీఎఫ్ఎక్స్ తమకు నచ్చితే అప్పుడే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నట్టు వశిష్ట తెలిపారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్ విశ్వంభరతో బాక్సాఫీస్‌ను ఎలా శాసిస్తారో చూడాలి! ఈ సినిమా మెగా అభిమానులకు నిజమైన పండగ అవుతుందా?

మరింత సమాచారం తెలుసుకోండి: