
ఈ మధ్య కాలంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తున్న సంగతి తెలిసిందే. విడుదలకు ముందే 46 అంతర్జాతీయ ఫిల్మ్ అవార్డులను అందుకున్న అర్జున్ చక్రవర్తి మూవీ నేడు థియేటర్లలో విడుదలైంది. విజయ రామరాజు టైటిల్ పాత్ర పోషించిన ఈ స్పోర్ట్స్ డ్రామాకు విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించారు. శ్రీని గుబ్బల నిర్మాణంలో ఈ మూవీ తెరకెక్కగా అజయ్, అజయ్ ఘోష్, దయానంద్ రెడ్డి, దుర్గేష్, సిజా రోజ్, హర్ష్ రోషన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందో లేదో ఇప్పుడు చూద్దాం.
కథ:
ఈ సినిమా మొత్తం పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. 1980 నుంచి 1996 మధ్య జరిగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. కథ విషయానికి వస్తే అనాథ అయిన అర్జున్ చక్రవర్తిని (విజయ్ రామరాజు) మాజీ కబడ్డీ ప్లేయర్ రంగయ్య(దయానంద్ రెడ్డి) చేరదీస్తాడు. ఈ క్రమంలో అర్జున్ చక్రవర్తికి సైతం కబడ్డీపై ఆసక్తి ఏర్పడుతుంది. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొనడం అర్జున్ చక్రవర్తి కల కాగా డిస్ట్రిక్ లెవల్ ఆడేటప్పుడు దేవకి(సిజా రోజ్) తో అర్జున్ కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది.
అర్జున్ స్టేట్ లెవెల్ కు ఆడే సమయంలో దేవకికి వేరే వ్యక్తితో పెళ్లి జరుగుతుంది. ఆ సమయంలో రంగయ్య అర్జున్ ను కెరీర్ పరంగా ప్రోత్సహిస్తాడు. అయితే ఆ తర్వాత అర్జున్ జీవితంలో ఊహించని ఘటనలు చోటు చేసుకుంటాయి. కోచ్ కులకర్ణి(అజయ్) అర్జున్ ని వెతుక్కుంటూ కబడ్డీ ఆడమని ఎందుకు అడుగుతాడు? అర్జున్ జీవితంలో చివరకు ఏమైంది? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
విశ్లేషణ:
సాధారణంగా స్పోర్ట్స్ డ్రామా అంటే ఆ సినిమాలు ఒక వర్గం ప్రేక్షకులే చూస్తారనే భావన చాలామందిలో ఉంటుంది. అయితే స్పోర్ట్స్ డ్రామాకు ఎమోషన్స్ యాడ్ చేసి తీస్తే సినిమా సంచలనాలు సృష్టిస్తుందని గతంలో జెర్సీ ప్రూవ్ చేయగా ఇప్పుడు అర్జున్ చక్రవర్తి సైతం అదే మ్యాజిక్ ను రిపీట్ చేసింది. నల్గొండకు చెందిన ఓ మాజీ కబడ్డీ ప్లేయర్ కథాంశంతో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుంది. రివర్స్ స్క్రీన్ ప్లేతో నడిపించడం సినిమాకు ప్లస్ అయింది.
అనాథ స్థాయి నుంచి నేషనల్ లెవెల్ ప్లేయర్ స్థాయికి అర్జున్ చక్రవర్తి ఏ విధంగా ఎదిగాడో తెరపై అందంగా చూపించారు. ఎన్నో వేరియేషన్స్ తో ఉన్న ఈ పాత్రలో విజయ రామరాజు అద్భుతంగా నటించారు. ఈ పాత్ర కోసం విజయ రామరాజు ఎంతో కష్టపడ్డారు. రంగయ్య పాత్రలో దయానంద్ రెడ్డి నటన ఆకట్టుకుంది. హీరోయిన్ సిజా రోజ్ తన పాత్రకు న్యాయం చేయగా కోచ్ పాత్రలో అజయ్ మెప్పించారు.
డైలాగ్స్ ఈ సినిమాకు మేజర్ అసెట్ కాగా తాగుడుకు బానిసైన వ్యక్తి లైఫ్ లో ఎలా గెలిచాడో కళ్ళకు కట్టినట్టు చూపించారు. హ్యాపీ ఎండింగ్ తో ముగించడం సినిమాకు ప్లస్ అయింది. అయితే స్లో నేరేషన్ ఈ సినిమాకు కొంతమేర మైనస్ అయింది.
పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ సినిమా కాగా ఆ కాలాన్ని తెరపై అద్భుతంగా చూపించారు. క్యాస్టూమ్స్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. మ్యూజిక్, బీజీఎమ్ బాగున్నాయి. ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. ఈ సినిమాకు మేకర్స్ ఖర్చు విషయంలో సైతం ఏ మాత్రం రాజీ పడలేదు.
బలాలు : విజయ రామరాజు నటన, ఫస్టాఫ్, బీజీఎమ్, స్క్రీన్ ప్లే
బలహీనతలు : స్లో నేరేషన్
రేటింగ్ : 3.0/5.0