సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక అరుదైన ఫోటో చక్కర్లు కొడుతోంది. అందులో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ, టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ముగ్గురు కలిసి కనిపిస్తున్నారు. అభిమానులు, సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చలకు కారణమైన ఈ ఫోటో అసలు ఎప్పటిదంటే… 2002లో విడుదలైన ఇండస్ట్రీ హిట్ మూవీ ఇంద్ర సెట్‌లోనిది. అప్పట్లో బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ చిరంజీవి కెరీర్‌లోనే టర్నింగ్ పాయింట్ అయ్యింది. చిరంజీవిపై కీలక సన్నివేశాలు జరుగుతున్న సమయంలో బాలయ్య సడన్‌గా సెట్‌కి వచ్చి, బ్రేక్ టైంలో చిరుతో సరదాగా గడిపారు. అప్పుడు తీసిన ఈ ఫోటో ఇప్పుడు బయటకు రావడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు. ఒకే ఫ్రేమ్‌లో ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఉండటం నిజంగా రేర్‌ సీన్ అని చెప్పాలి.


కానీ ఈ ఫోటో వెనుక ఉన్న అసలు కథ మరింత ఆసక్తికరం. ఇంద్ర మూవీ మొదటగా బాలయ్య కోసం ప్లాన్ చేశారు. అప్పట్లో బి గోపాల్బాలయ్య కాంబినేషన్ బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతోంది. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్ల తర్వాత, అదే జోనర్‌లో ఇంద్ర కథను బాలయ్యకే చెప్పాలని డిసైడ్ చేశారు. కానీ అప్పటికే బాలయ్య డేట్స్ ఫుల్‌గా ఉండటంతో పాటు సీమసింహం, చెన్నకేశవ రెడ్డి వంటి ఫ్యాక్షన్ సినిమాల్లో బిజీగా ఉన్నారు. దీంతో ఇంద్ర చేయడం కుదరలేదు. ఈ సమయంలోనే నిర్మాత అశ్వినీదత్ బి గోపాల్‌కు ఒక సలహా ఇచ్చారు – “ఈ కథ చిరంజీవి చేస్తే బాగుంటుంది” అని. అప్పుడు వరుసగా అన్నయ్య, మృగరాజు, డాడీ లాంటి ఫ్లాప్స్‌తో ఇబ్బందుల్లో ఉన్న చిరంజీవి, కొత్తగా ఉండే ఇంద్ర కథకు వెంటనే ఓకే చెప్పారు. ఇలా బాలయ్య మిస్ అయిన సినిమా చిరంజీవి చేతికి వచ్చింది.



సినిమా రిలీజ్ అయిన తర్వాత అంచనాలకు మించి హవా క్రియేట్ చేసింది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా ఏకంగా రూ.52 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 50 కోట్లు వసూలు చేసిన తొలి తెలుగు సినిమా రికార్డు ఇంద్ర పేరుకే దక్కింది. 152 సెంటర్లలో 50 డేస్, 122 సెంటర్లలో 100 డేస్, 32 సెంటర్లలో 175 డేస్, సత్యం థియేటర్లో 247 రోజులు ఆడింది. ఇంత పెద్ద ఇండస్ట్రీ హిట్ సాధించి చిరంజీవికి కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచింది. అంటే చెప్పాలంటే – బాలయ్య వదిలిన ఇంద్ర, చిరంజీవి కెరీర్‌లోనే అద్భుత విజయాన్ని తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు ఆ సెట్లో తీసిన చిరు – బాలయ్యఅశ్వినీదత్ అరుదైన ఫోటో బయటకు రావడంతో, అభిమానులు మరోసారి ఆ గొప్ప కాలాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: