సినీ ప్రపంచం ఈ మధ్యకాలంలో ఓ దుఃఖ వలయంలో చిక్కుకున్నట్లుగా కనిపిస్తోంది. అభిమానులు ప్రేమించే నటీనటులు అనారోగ్య సమస్యలతో వరుసగా ప్రాణాలు కోల్పోతుండటంతో, సినీ వర్గాలు, ప్రేక్షకులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు. ఒకవైపు వయోభారం కారణంగా పలువురు సీనియర్ నటులు మృతిచెందుతుండగా, మరోవైపు కొంతమంది ప్రతిభావంతులైన కళాకారులు అనారోగ్యంతో బాధపడుతూ చివరకు తుదిశ్వాస విడిచేస్తున్నారు. తాజాగా అటువంటి మరో విషాద వార్త వినిపించింది. పాన్ ఇండియా స్థాయిలో సంచలనంగా నిలిచిన కేజీఎఫ్ సిరీస్‌లో కీలక పాత్ర పోషించిన నటుడు హరీష్ రాయ్ ఇక లేరు. గత కొంతకాలంగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతూ జీవన పోరాటం సాగించిన ఆయన, చివరికి ప్రాణాలు విడిచారు. ఆయన మరణ వార్త తెలిసి అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను పంచుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.


హరీష్ రాయ్, ఓం, నల్ల వంటి సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన యొక్క దృఢమైన రూపం, గంభీరమైన స్వరం, యాక్షన్ సీక్వెన్స్‌లలో చూపిన ప్రాభవం ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అయితే, ఈ శక్తివంతమైన నటుడు మూడు సంవత్సరాలుగా ఒక భయంకరమైన వ్యాధితో పోరాడుతున్నారనే విషయం చాలా మందికి తెలియదు. ఒకసారి ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన బాధను ఇలా వెల్లడించారు —“గత మూడు సంవత్సరాలుగా నేను గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నాను. ఆపరేషన్ చేయించుకోవడానికి సరిపడా డబ్బు లేకపోవడంతో ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాను. నాకు క్యాన్సర్ ఉందని తెలిసిపోతే సినిమాల్లో అవకాశాలు రావని భయపడ్డాను. అందుకే ఆ విషయం ఎవరితోనూ చెప్పలేదు. కేజీఎఫ్ సినిమాలో గుబురు గడ్డంతో నటించడానికి కారణం అదే. నా గొంతు పరిస్థితి దాచుకునేందుకు అలా చేశాను. సినిమాలు విడుదలయ్యే వరకు వేచి చూశాను. ఇప్పుడు వ్యాధి నాలుగో దశకు చేరుకుంది. సహాయం కోరాలని అనుకున్నాను, వీడియో కూడా రికార్డు చేశాను కానీ దానిని బయట పెట్టే ధైర్యం చేయలేకపోయాను.” అంటూ ఓ ఇంటర్వ్య్య్లో బయట పెట్టారు.



ఆయన ఈ మాటలు విన్న అభిమానులు ఆ సమయంలోనే దిగ్భ్రాంతి చెందారు. ఆ తర్వాత ఒక యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు ఈ విషయం బయటపెట్టడంతో, స్టార్ హీరో ధృవ సర్జ ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేసినా, హరీష్ రాయ్ ఆరోగ్యం తిరిగి మెరుగుపడలేదు. చివరికి వ్యాధి తీవ్రతను తట్టుకోలేక ప్రాణాలు విడిచారు.ఇండస్ట్రీకి, అభిమానులకు ఇది భరించలేని నష్టం. కేజీఎఫ్ వంటి మహా చిత్రంలో చిన్న పాత్రలో కనిపించినా తన నటనతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన, నిజజీవితంలో కూడా పోరాట యోధుడే. అనారోగ్యంతోనూ చిరునవ్వు కోల్పోని వ్యక్తి అని సహచరులు ఆయనను గుర్తుచేసుకుంటున్నారు. హరీష్ రాయ్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని సినీ ప్రపంచం మొత్తం ప్రార్థిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: