వినాయక చవితి సందడి మొదలైంది. ఇప్పటికే భారీ గణపతుల విక్రయాలు పూర్తవుతున్నాయి. చవితి నాడు కొలువు దీరేందుకు గణనాధులు సిద్ధమవుతున్నారు. ఇక జంట నగరాల విషయానికి వస్తే సందడి అంతా ఖైరతాబాద్ వినాయకుడిదే అని చెప్పాలి. ఇక్కడి భారీ గణపతికి చాలా చరిత్ర ఉన్న సంగతి తెలిసిందే. అతి పెద్ద వినాయకుడు కావడంతో భక్తులు కూడా తండోపతండాలుగా వస్తారు.


ఇక్కడి గణనాథుని సందర్శించుకోవడం ఓ గొప్ప అనుభూతి. అందుకే ఖైరతాబాద్ గణపతికి ప్రత్యేకమైన కానుకలు కూడా వస్తుంటాయి. ఇక్కడి గణపతి లడ్డూను తాపేశ్వరం నుంచి ప్రత్యేకంగా పంపిస్తుంటారు కూడా. అయితే ఈ సారి చేనేత కార్మికులు ఖైరతాబాద్ గణపతికి ఓ మంచి ప్రత్యేకమైన కానుకను అందజేస్తున్నారు. నిత్యంవేలాది మంది దర్శించుకునే గణనాథుడి మెడలో ఉండే కండువాను యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి చేనేత పార్క్‌లో తయారు చేయించారు.


భూదాన్‌పోచంపల్లి మండలం కనుముకులలోని చేనేత పార్క్‌లో మగ్గంపై ఖైరతాబాద్‌ గణపతికి ప్రత్యేకమైన కండువా నేయించారు. ఇలా ప్రత్యేకమైన కండువా తయారు చేయడం వీరికి ఇది ఐదోసారట. ఈ విషయం పార్క్‌ ఛైర్మన్‌ కడవేరు దేవేందర్‌ చెబుతున్నారు. ఇక ఈ కండువా విశేషాలేంతో తెలుసుకుందామా.. ఈ కండువా 25 మీటర్ల పొడవు, మీటరు వెడల్పు ఉంటుంది. అంతా ఏకవస్త్రమే. అంటే అతుకులు ఉండవన్నమాట.


ఇక ఈ కండువాలో శివలింగం, ఢమరుకం, త్రిశూలం, లడ్డూలు, తామర, బాణం, కలశం, పుష్పం, ఓంకారం, స్వస్తిక్‌, శ్రీగణేశ్‌, జై గణేశ్‌ అనే ఆకారాలు, అక్షరాలు రూపొందించారు. వీటితో పాటు పార్క్‌ గుర్తు కూడా వేయించారు. పోచంపల్లి చేనేత పార్క్‌ కళాకారులు దాదాపు నెల రోజులకు పైగా శ్రమించి ఈ కండువాను తయారు చేశారట. వినాయక చవితి రోజు ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామివారికి సమర్పిస్తామని పార్క్ ఛైర్మన్ కడవేరు దేవేందర్ చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: