కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వానికి ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా ఎన్నికలు వాయిదా వేయడాన్ని సీఎం జగన్‌తో సహ వైసీపీ నేతలు తప్పుబడుతున్నారు. అలాగే నిమ్మగడ్డ రమేష్‌‌పై వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే ఏపీ సి‌ఎస్ నీలం సాహ్ని కూడా ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డకు ఎన్నికలు త్వరగా జరపాలని లేఖ కూడా రాశారు.

 

ఏపీలో కరోనా వ్యాప్తి లేదని, ఎన్నికలు యథావిధిగా జరిగేలా చేయాలని లేఖలో కోరారు. ఇక సి‌ఎస్ లేఖపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా ఘాటుగానే స్పందిస్తూ...మూడు పేజీల లేఖ రాశారు. ఎన్నికలు వాయిదా వేశామని చెప్పి, ఎన్నికల సంఘంపై నిందలు వేయడం సరికాదని నిమ్మగడ్డ చెప్పారు. ఇక గతంలో రాజ్ భవన్‌లో కంటే ముందు ఆర్థిక శాఖలో ఫైనాన్స్ వ్యవహారాలు చూశానని, ఆర్థిక వ్యవహారాలపై తనకు పూర్తి అవగాహన ఉందని లేఖలో పేర్కొన్నారు.

 

ఎన్నికల వాయిదా పడటం వల్ల, రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకుండా ఉండవని, ఎన్నికలకు ఆర్థిక సంఘం నిధులకు లింక్ పెట్టవద్దని, గతంలో కూడా ఇదేవిధంగా ఎన్నికలు నిలిపివేసినా కేంద్రం నుంచి నిధులు వచ్చిన  సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. అసలు కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటికే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిసా రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఆపేశారని చెప్పుకొచ్చారు.

 

కరోనా ఛాలెంజ్ ఎదుర్కుంటున్న ప్రస్తుత దశలో ఏపీ ఒంటరిగా లేదని, రాష్ట్ర ఎన్నికల కమీషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలను, ఆరోగ్య, కుటుంబ సంక్షేమమంత్రిత్వశాఖతో మార్గదర్శకాలను పాటిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 14న కూడా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శితో మాట్లాడానని, అలాగే అన్నీ రాష్ట్రాల ఎలక్షన్ కమిషనర్స్‌తో టచ్‌లో ఉన్నామని, ప్రజా శ్రేయస్సు దృష్టిలో పెట్టుకునే ఎన్నికలు వాయిదా వేశామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: