కరోనాపై భారత దేశం యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధం దేశ భవిష్యత్తుకు చాలా కీలకమైంది. 21 రోజుల యుద్ధంలో భారత్ ఎంత వరకూ విజయం సాధిస్తుందన్నది చూడాలి. ప్రస్తుతానికి ఇండియాలో కరోనా అదుపులోనే ఉంది. మొత్తం మీద చూసినా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 700 వందల లోపే ఉంది. కరోనాతో ఇప్పటి వరకూ కేవలం 10 మంది మాత్రమే మరణించారు.

 

 

అలాగని దీన్ని తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఒకప్పుడు ఇదే స్థితిలో ఉన్న ఇటలీ, స్పెయిన్ లో ఇప్పుడు రోజూ వందల మంది ప్రాణాలు వదలుతున్నారు. వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ 21 రోజుల యుద్ధంలో ఇండియా ఘన విజయం సాధిస్తుందని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. మహాభారత యుద్దాన్నే చూసిన భారతదేశం కరోనా యుద్దాన్ని ఎదుర్కోలేదా అని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశ్నించారు.

 

 

కరోనా మహమ్మారిపై 130 కోట్ల మంది భారతీయులు యుద్ధం చేస్తున్నారని, గడప దాటకుండానే ఈ మహమ్మారిని తరిమికొడదామని ప్రధాని మోడీ మరోసారి పిలుపు ఇచ్చారు. మహాభారతాన్ని అప్పట్లో 18 రోజుల్లో ముగించారని మోడీ గుర్తు చేశారు. ఇప్పడు 21 రోజుల్లో కరోనాను జయించలేమా అని ప్రధాని మోడీ ప్రశ్నించారు. వారణాసి నియోజకవర్గ ప్రతినిధులు, నిపుణులు, శాస్త్రవేత్తలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.

 

 

అయితే.. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పుడు అంతా బాగుందని తాను చెప్పలేనని ప్రధాని మోడీ అన్నారు. అందుకే ప్రజలు ఇళ్లలోనే ఉండి సామాజిక దూరాన్ని పాటించాలని ఇది మన అలవాటుగా మారాలని మోడీ ప్రజలను కోరారు. ఈ మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో అవసరమైన సమాచారం కోసం 9013151515 వాట్సాప్‌ నెంబర్‌తో హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నెంబర్‌కు నమస్తే అని వాట్సాప్‌ చేస్తే సమస్త సమాచారం అందుబాటులో ఉంటుంది. కరోనాపై యుద్ధంలో భారత్ విజయ భేరీ మోగిస్తుందని ఆశిద్దాం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: