రాష్ట్రమంతా కరోనా కట్టడిలో నిమగ్నమైన సమయంలో కొందరు ఆకతాయిలు మాత్రం రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియా అస్త్రంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. సమాజంలో అశాంతి రేపేందుకు కంకణం కట్టుకున్నారు. తప్పుడు వార్తలను సర్క్యులేట్ చేస్తూ భయాందోళనలకు కారణమవుతున్నారు.
ఇలాంటి వారిపై జగన్ సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. సోషల్ మీడియా దుష్ప్రచారాలపై ఏపీ సర్కారు కన్నెర్ర చేసింది. కరోనా కు సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులు సుమారు 60 కేసులు నమోదు చేశారు. అసత్య ప్రచారాలతో భయాందోళనలు సృష్టించటం, కావాలనే విషం చిమ్మేలా నకిలీ పోస్టులు సృష్టించి వైరల్ చేస్తున్న వారిని గుర్తించి వారిపై ఏపీ పోలీసులు కేసులు పెట్టారు.
గతంలో జరిగిన ఏవేవో ఘటనలకు సంబంధించిన పాత చిత్రాలు, వీడియోలను జోడించి అవి కరోనాకు సంబంధించినవేనంటూ సోషల్ మీడియాల్లో తిప్పేవారిని పోలీసులు గుర్తించారు. ఇలా సామాజిక మాధ్యమాల్లో చాలామంది పోస్టులు వైరల్ చేస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నారు. చిత్తూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల పరిధిలో అధికంగా కేసులు నమోదయ్యాయి.
మీకు కూడా ఇలాంటి మెస్సేజులు రావచ్చు.. జాగ్రత్తపడండి.. తొందరపడి ఇలాంటివి స్ప్రెడ్ చేయకండి.. వివాదాల్లో ఇరుక్కోకండి.. తస్మాత్ జాగ్రత్త.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి