దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఏపీలో ప్రతిరోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 44 కేసులు కొత్తగా నమోదయ్యాయి దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 647కు చేరింది. ప్రస్తుతం 565 మందికి చికిత్స జరుగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 17మంది మృతి చెందారు. 
 
ఇప్పటివరకు 65 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొన్ని ప్రాంతాలలో ప్రజలు లాక్ డౌన్ నిబంధనలను సరిగ్గా పాటించడం లేదు. టెంపుల్ సిటీ శ్రీకాళహస్తిని కరోనా వణికిస్తోంది. ఇప్పటివరకు శ్రీకాళహస్తిలో పది కరోనా కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో శ్రీకాళహస్తి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ఏరియాలను రెడ్ జోన్లుగా గుర్తించారు. 
 
చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు సమీక్ష నిర్వహించారు. తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి అధికారులతో కలిసి నియోజకవర్గంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఎమ్మెల్యే ఎవరిలోనైనా కరోనా సంబంధిత లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. 
 
కాళ్లు మొక్కుతా... గడప దాటకుండా ఉండండి అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో ఈరోజు నమోదైన కేసుల్లో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 26, తూర్పు గోదావరి జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 3, కృష్ణా జిల్లాలో 6, అనంతపురం జిల్లాలో 3, విశాఖపట్నం జిల్లాలో ఒక కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నా... కేసులు నమోదు కాకుండా చర్యలు చేపడుతున్నా రాష్ట్రంలో వైరస్ విజృంభిస్తూనే ఉంది. ప్రభుత్వం కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకుంటోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: