ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది? అధ్యక్షుడిపై ఆస్థాయిలో విమర్శలకు కారణం ఏంటి? ఆస్థాయిలో దాడి జరిగినా కనీసం మిగిలిన సీనియర్లు ఇతరులు ఎందుకు ఖండించలేదు. ఈ వ్యవహారంపై అధిష్టానం ఎలా స్పందిస్తుంది. ప్రస్తుతం ఇదే టాపిక్‌ నడుస్తోంది. 

 

ఏపీలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా పై చేసిన ఆరోపణలు కాక పుట్టించాయి. 20 కోట్లకు కన్నా అమ్ముడు పోయారని... అందుకే ఏపీ బీజేపీలో కన్నా మాత్రమే తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి తోడు బీజేపీ అధిష్టానం ఇచ్చిన ఎలక్షన్‌ ఫండ్‌లోనూ గోల్‌మాల్‌ జరిగిందంటూ ఆయన చేసిన ఆరోపణ మరింత వేడి పుట్టించింది. దీనికి కన్నా కూడా అంతే గట్టిగా సమాధానం చెప్పారు. సాయి రెడ్డి చేసిన ఆరోపణలపై కాణిపాకం  వినాయకుడి గుడిలో సత్య ప్రమాణానికి సిద్దామా అని ప్రశ్నించగా.. మరిన్ని ఘాటు ఆరోపణలతో వైసిపి విరుచుకుపడింది. కన్నా పార్టీ  మారే ప్రయత్నం చేశారా లేదా? గుండె నొప్పి అంటూ డ్రామా అడారా లేదా అంటూ వైసీపీ ముఖ్యనేతలు అటాక్‌ చేశారు. 

 

కన్నా పై ఆరోపణల్లో నిజానిజాలు పక్కనపెడితే... ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపై ఈ స్థాయిలో విమర్శలు వచ్చినప్పుడు ఆ పార్టీ నేతలు  స్పందించిన తీరు మాత్రం కొత్త చర్చకు దారి తీస్తోంది. అలాగే ఎన్నికల ఫండ్ విషయంలో సాయిరెడ్డి వ్యాఖ్యలపైనా ఎవరూ మాట్లాడలేదు. దీంతో అసలు ఏం జరిగి ఉంటుందనే చర్చ తెరమీదకు వచ్చింది. 

 

కన్నా తో పాటు పురంధేశ్వరిపైనా ఎంపీ సాయిరెడ్డి విమర్శలు చేశారు. తన దగ్గర నిధుల దుర్వినియోగం పై ఆధారాలు కూడా  ఉన్నాయన్నారు. ఈ విషయంలో పార్టీ రాష్ట్ర పెద్దలు చెప్పింది  ఒకటైతే... జరిగింది మరొకటి అనే వాదన బీజేపీ శ్రేణుల్లో చాలా రోజులుగా ఉంది. ఇప్పుడు సాయిరెడ్డి ప్రస్తావనతో నిజంగానే నిధుల గోల్ మాల్ జరిగిందా అనే కొత్త వాదన మొదలైంది. కన్నా నాయకత్వం పట్ల వ్యతిరేకతతో ఉన్న కొందరు నేతలు కేంద్ర పార్టీ నిధుల విషయంలో అసంతృప్తిగానే ఉన్నారు. 

 

ఇటు ఏపీ బీజేపీలో వైసీపీతో పాటు టీడీపీకి అనుకూల నేతలున్నారన్న వాదన ఉంది. అందుకే తాజా పరిస్థితుల్లో స్పందిచకపోవడానికి కొన్ని లెక్కలు కూడా ఉన్నాయని చర్చ సాగుతోంది. అమరావతి విషయంలో నేతలు అంటీ ముట్టనట్లు ఉంటే .. కన్నా లీడ్ తీసుకుని ప్రభుత్వంపై వాదనకు దిగారు. ఇదే  సందర్భంగా సుజనా తో పాటు కొందరు నేతలు.... ఆయనకు దగ్గరయ్యారని..... తమ వైపు తిప్పుకున్నారని పార్టీలో ఉన్న ఇతర  సీనియర్లు భావిస్తున్నారు.

 

మొత్తానికి ఈ పరిణామాలు చాలా దూరం వెళతాయని కన్నా వర్గం చెపుతుండగా.....అధిష్టానం ఈవిషయంలో  పెద్దగా జోక్యం చేసుకోదన్నది మరికొందరి మాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: