ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాలను గ‌డ‌గ‌డ‌లాడిస్తుంది. క‌రోనా కోర‌ల్లో చిక్కుకున్న ప్ర‌భుత్వాలు విల‌విల‌లాడిపోతున్నాయి. ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది. ఇదిలా ఉంటే.. లాటరీ వ్యవస్థ తీసుకురావ‌డానికి ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తుందా..? అంటే అవున‌నే సమాధానం వినిపిస్తోంది. వాస్త‌వానికి లాటరీ అంటేనే అదృష్టం. అలాంటి లాటరీ తగిలిందంటే ఇక ఆ వ్యక్తి ఆనందానికి అవదులుండవు. అందుకే ఎప్పుడో ఒక‌సారి ల‌క్ త‌గ‌ల‌కుండా ఉంటుందా అని లాట‌రీ కొన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. ఇక‌ గతంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా లాటరీ వ్యవస్థ ఉండేది. 

 

కానీ, పేదలు వీటికి బానిసలుగా మారి నష్టపోతుండటంతో లాటరీ వ్యవస్థపై నిషేధం విధించారు. అయితే ఇప్పుడు మ‌ళ్లీ లాటరీ వ్యవస్థను తీసుకురావ‌డానికి జ‌గ‌న్ స‌ర్కార్ అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం.. ఆదాయలోటును పూడ్చుకోవడానికే అన‌ట్లు తెలుస్తోంది. నిజానికి విభజన తర్వాత లోటు బడ్జెట్ లో ఉన్న ఏపీ.. అనంతరం పలు సంక్షేమ పథకాల కోసం పాలకులు భారీగా వెచ్చించడంతో పీకల్లోతు అప్పల్లో కూరుకుపోయింది. మ‌రోవైపు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎంగా అధికారంలోకి వ‌చ్చాక‌.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు దశలవారీగా మద్య నిషేధం విధించడానికి సిద్ధమ‌య్యారు.

 

ఒక‌వేళ అదే జరిగితే మద్యం ద్వారా ప్ర‌భుత్వానికి వచ్చే కోట్ల రూపాయల ఆదాయం కోల్పోక తప్పదు. ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ ఉన్న ఏపీకి ఇది కోలుకోని దెబ్బ అవుతుంది. అందుకే ఆ ఆదాయలోటును పూడ్చుకోవడానికి లాటరీ టిక్కెట్లను తీసుకురావాలని దాదాపుగా నిర్ణయించుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇక‌ ఇప్పటికే అంతర్గతంగా కసరత్తు పూర్తి చేసేసిన తర్వాత.. ఇప్పుడు.. ధరలు ఎలా ఉండాలన్నదానిపై పరిశీలన జరుపుతోంది. ప్రస్తుతం దేశంలో ఈశాన్య రాష్ట్రాలతోపాటు కేరళలో లాటరీలు నడుస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో లాటరీల ధరలను పరిశీలించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలిచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.

 
 

 

   
 

మరింత సమాచారం తెలుసుకోండి: