ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌ కూ.. ఏపీ సీఎం జగన్‌ కూ ఉన్న జగడం సంగతి తెలిసిందే. ఈ యుద్ధం ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలతోనే మొదలైంది.. అయితే మళ్లీ ఇప్పుడు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణవైపు నిమ్మగడ్డ ప్రయత్నిస్తుండటంతో మరోసారి యుద్ధం మొదలైన సూచనలు కనిపిస్తున్నాయి. నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్‌గా ఉన్నంత వరకూ స్థానిక సంస్థల ఎన్నికల జోలికి వెళ్లకూడదన్న ఆలోచన వైసీపీలో ఉంది.


జగన్ సర్కారుతో పోస్టు నుంచి బలవంతంగా పంపేయబడి.. ఆ తర్వాత దీర్ఘకాలికంగా కోర్టుల్లో పోరాడి మళ్లీ తన స్థానం సంపాదించుకున్న నిమ్మగడ్డ తన పని తాను చేసుకుపోవాలని చూస్తున్నట్టున్నారు. ఇప్పటికే గతంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి.. కొంత ప్రక్రియ జరిగింది కాబట్టి.. మిగిలిన ప్రక్రియ ఇప్పుడు పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నారు. ఆ దిశలో ఇవాళ కీలక అడుగు పడింది. ఇప్పటికే లాక్ డౌన్ నిబంధనల సడలించినందువల్ల  ఎన్నికల నిర్వహణపై పార్టీల అభిప్రాయం కోరాలని నిమ్మగడ్డ భావిస్తున్నారు.


గతంలో ఒక్క కేసు ఉన్నప్పుడు ఎన్నికలను అర్దంతంరంగా వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల విషయమై ఈ నెల ఇరవై ఎనిమిదిన రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో స్థానిక ఎన్నికల విషయంలో మరోసారి ఎన్నికల కమిషన్ కు, ప్రభుత్వానికి మధ్య వివాదం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే దీనిపై మంత్రి మేకపాటి గౌతం రెడ్డి  స్పందించారు. నవంబర్, డిసెంబర్ లలో కరోనా రెండో దశ వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారని.. అందుకే ఇప్పటికైతే వచ్చే రెండు నెలల్లో ఎన్నికలు పెట్టడం సాధ్యం కాకపోవచ్చని ఆయన తేల్చి చెప్పారు.

అయితే 28న జరిగి పార్టీల సమావేశంలో ఏ పార్టీ ఏం చెబుతుందన్నది కీలకంగా మారింది. అన్ని పార్టీలు ఎన్నికలు వాయిదా వేయాలని చెబితే ఏ గొడవా ఉండదు. అలా కాకుండా టీడీపీ వంటి పార్టీలు ఇప్పుడు స్థానిక ఎన్నికలు పెట్టాల్సిందే అంటే మాత్రం మరో వివాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: