కరోనా.. ఇప్పుడంటే దీనిబారిన పడని వారు అంటూ ఎవరూ లేరు కానీ.. ఈ మహమ్మారి అడుగు పెట్టిన మొదట్లో కరోనా పేషెంట్ అంటే అణుబాంబును చూసినట్టు చూసేవాళ్లు.. కరోనా పేషెంట్ అంటే ఆమడ దూరం పారిపోయే వాళ్లు.. అలాంటి పరిస్థితుల్లోనూ కొవిడ్ వారియర్స్ గా డ్యూటీలు చేసిన వాళ్లలో జర్నలిస్టులు కూడా ఉన్నారు. అలాంటి జర్నలిస్టులను తెలంగాణ మీడియా అకాడమీ ఆదుకుంది. కరోనా బారిన పడిన ప్రతి జర్నలిస్టుకూ.. మొదట్లో 20 వేల రూపాయల చొప్పున.. ఆ తర్వాత 10 వేల రూపాయల చొప్పున ఇచ్చి ఆదుకుంది.

ఇలా ఇప్పటి వరకూ కోవిడ్ బారిన పడిన జర్నలిస్టులకు 3 కోట్ల 12 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసినట్టు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు వల్ల ఏర్పడిన జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడిన 1603 మంది జర్నలిస్టులకు 3 కోట్ల 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశామని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ చెప్పారు.

ఫ్రంట్ లైన్ వారియర్ గా ఉన్న జర్నలిస్టులు వార్తా సేకరణలో భాగంగా పలువురు జర్నలిస్టులకు కరోనా సోకింది. వీరిని ఆదుకోవడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంది. మీడియా అకాడమి ద్వారా కరోనా పాజిటీవ్ వచ్చిన 1517 మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 20 వేల చొప్పున, 3 కోట్ల 3 లక్షల 40 వేలు, దీనితోపాటు ప్రైమరీ కాంటాక్ట్ చేత హోంక్వారంటైన్లో ఉన్న 86 మంది జర్నలిస్టులకు 10 వేల చొప్పున, 8 లక్షల 60 వేలు ఆర్థిక సహాయం అందించారు.

మొత్తంగా సంక్షేమ నిధి నుండి 1603 మంది జర్నలిస్టులకు ఇప్పటి వరకు 3 కోట్ల 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. మీడియా అకాడమి చరిత్రలో కరోనా బారిన పడిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించడమనేది ఒక మైలు రాయి అనే చెప్పాలి. కరోనా సోకిన జర్నలిస్టులు తమ అక్రిడిటేషన్ గాని, గుర్తింపు కార్డు గాని, పాజిటీవ్ వచ్చిన ధృవీకరణ పత్రము, బ్యాంకు వివరాలను మీడియా అకాడమీ కార్యాలయానికి పంపిన వెంటనే సత్వరమే స్పందించి ఆయా జర్నలిస్టుల ఖాతాలో డబ్బులు జమ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: