తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక ఉప ఎన్నికల తరువాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు నగారా మోగింది. మరికొద్ది రోజుల్లోనే జరగనున్న ఈ జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఇక ఇటీవలే జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ‘పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్’ వ్యాఖ్యలు తీవ్రమైన దుమారం రేపుతున్నాయి. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. బండి సంజయ్ మతిస్తిమితం లేకుండా మాట్లాడుతున్నారని కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. సర్జికల్ స్ట్రైక్స్ అంశాన్ని ఆ పార్టీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమర్థిస్తారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. కొన్ని ఓట్లు, సీట్ల కోసం బండి సంజయ్ ఇంత దారుణంగా మాట్లాడటం సరికాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.


అయితే, కేటీఆర్‌ ట్వీట్‌పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు. ‘‘మతిస్తిమితం లేదా? మరి దీన్ని బట్టి మంత్రి కేటీఆర్‌కు అక్రమ వలసదారులు, రోహింగ్యాలు కావాలన్నమాట! వారు హైదరాబాదీల హక్కుల్ని లాక్కుంటుండమే కేటీఆర్‌కు కావాలేమో! అసలు కేటీఆర్ మనసు హైదరాబాదీలపైకి కాకుండా రోహింగ్యాలవైపు ఎందుకు పోతోంది? ఎందుకంటే.. కేటీఆర్ ఇప్పటికే రోహింగ్యాలకు సామాజిక, ఆర్థిక, పౌరసత్వ సౌకర్యాలను ఎంఐఎం సహకారంతో వారికి అందించేశారు.’’ అని ఓ ట్వీట్ చేశారు.


మరో ట్వీట్‌లో..‘‘మిస్టర్ కేటీఆర్.. భైంసాలో హిందువులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లు మీకు కనిపించలేదు. హైదరాబాద్‌లో కొద్ది రోజుల క్రితం వచ్చిన వరదలు మీకు ఇబ్బంది కలిగించలేదు. కొవిడ్‌ను అరికట్టడంలో అసమర్థంగా వ్యవహరించడం పట్ల కూడా మీకు ఏ ఆందోళనా లేదు. కానీ, రోహింగ్యాల విషయానికొచ్చేసరికి మీరు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నారే! రోహింగ్యాలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు, షాదీ ముబారక్ కూడా ఇస్తారేమో’’ అని అర్వింద్ ట్వీట్ చేశారు. ఈ రెండు ట్వీట్లకు కేటీఆర్ చేసిన ట్వీట్ల స్క్రీన్ షాట్లను జోడించారు. ఈవిధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార వేడి తారాస్థాయికి చేరుకుంది.







మరింత సమాచారం తెలుసుకోండి: