కేంద్రంలో అధికారంలో ఉన్న ప్ర‌‌ధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ స‌ర్కారు ఇటీవ‌ల తీసుకువ‌చ్చిన వివాదాస్ప‌ద మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు కొన‌సాగిస్తున్న ఆందోళ‌న‌లు మ‌రింత ఉధృతం అవుతున్నాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీ స‌‌రిహ‌ద్దు రోడ్ల‌పై బైఠాయించి "ఛ‌లో ఢిల్లీ"నిర‌స‌న‌ల‌కు  దేశ‌వ్యాప్తంగా మ‌ద్ధ‌తు పెరుగుతోంది. ఇప్ప‌టికే దేశంలోని అన్ని రాష్ట్రాల‌కు చెందిన రైతులు ఢిల్లీబాట ప‌ట్టారు. ఆందోళ‌న‌లో ఉన్న రైతులు త‌మ డిమాండ్ల‌ను ఒప్పుకునే వ‌రకూ వెన‌క్కి త‌గ్గే ప్ర‌స‌స్తే లేద‌ని ప్ర‌భుత్వానికి తేల్చిచెప్పారు.

తాజాగా చోటుచేసుకుంటున్న రైతు అందోళ‌న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే..ఛ‌లోఢిల్లీ నిర‌స‌న‌లు మ‌రింత ఉధృతమ‌య్యే అవ‌కాశ‌మున్న‌ట్టు క‌న‌బ‌డుతోంది. ఈ నేప‌థ్యంలోనే అప్ర‌మ‌త్త‌మైన కేంద్రం.. ప‌రిస్థితులు మ‌రింత దిగ‌జార‌క‌ముందే ఇదివ‌ర‌కూ అనుకున్న టైం క‌న్న ముందే.. రైతుల‌కు చ‌ర్చ‌లు జ‌రిపేందుకు కేంద్రం సిద్ధ‌మైన‌ట్టు స‌మాచారం. ఈ రోజు (మంగ‌ళ‌వారం) మూడు గంట‌ల‌కు రైతుల‌తో.. కేంద్ర ర‌క్ష‌ణ  శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, వ్య‌వ‌సాయ మంత్రి తోమ‌ర్‌లు చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు. 

ఈ మేర‌కు త‌మ‌కు స‌మాచారం అందింద‌ని నిర‌స‌న‌లు తెలుపుతున్న  రైతులు వెల్ల‌డించారు. ముంద‌స్తు ష‌ర‌తులు  లేకుండా త‌మ‌ను ప్ర‌భుత్వం చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించింద‌నీ, రైతుల త‌ర‌ఫున దాదాపు 35 మంది ప్ర‌తినిధులు పాలుగొంటార‌ని తెలిపారు. ప్ర‌భుత్వంతో ఎలాంటి చ‌ర్చ‌లు జ‌రిపిన త‌మ మొద‌టి డిమాండ్ వివాదాస్ప‌ద మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకోవ‌డమేన‌ని స్ప‌ష్టం చేశారు. అలాగే, ఎమ్ఎస్‌పీపై చ‌ట్టానికి తీసుకురావ‌డానికి డిమాండ్ చేయ‌నున్నామ‌ని తెలిపారు. 

ప్రభుత్వం త‌మ డిమాండ్ల‌కు అంగీకరించకపోతే, నిరసనలు కొనసాగుతాయ‌ని  భారతీయ కిసాన్ యూనియన్‌కు చెందిన జగ్జిత్ సింగ్ దల్లెవాల్ తెలిపారు. ఇదిలా ఉండ‌గా.. ప్ర‌తిప‌క్షాల‌తో పాటు దేశ ప్ర‌జ‌లంద‌రి నుంచి రైతుల‌కు మ‌ద్ధ‌తు పెరుగుతోంది. తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. 
 దేశానికి అన్నం పెట్టే రైతుకు మనం ఎప్పటికీ రుణపడి ఉంటామననీ, ఇకనైనా ప్రభుత్వం అహంకారాన్ని వీడి అన్నదాతలకు న్యాయం చేయాలని కేంద్రాన్ని కోరారు. రైతుల‌కు త‌మ మ‌ద్ధ‌తు ఎల్లప్పుడు ఉంటుంద‌ని తెలిపారు. ఈ దేశంలో సుభిక్షంగా ఆరోగ్యంగా జీవిస్తున్న‌దంటే అది అన్న‌దాత‌ల వ‌ల్లేన‌నీ, అలాంటి వారిపై లాఠీఛార్జ్‌లు, బాష్పవాయువులు ప్రయోగించ‌డం స‌రికాద‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: