మాజీ మంత్రి అఖిల ప్రియ బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు. ఆమె బెయిల్ కోసం చాలా ప్రయత్నిస్తున్నారు. కోర్టు ఈ విషయంపై వాదనలు విని రేపటికి వాయిదా వేసింది. అయితే ఇదే కేసులో అఖిలప్రియ భర్త భార్గవ్‌ రామ్ ను పోలీసులు రిమాండ్ రిపోర్టులో ఏ3 గా నమోదు చేసారు. అఖిలప్రియ భర్తకు నేర చరిత్ర ఉందని రిపోర్టులో తెలిపారు. భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్ కోసం ఇంకా పోలీసులు వెదుకుతూనే ఉన్నారు.

భార్గవ్ రామ్ ప్రస్తుతం పరారీలోనే ఉన్నారు. ఆయన కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ బెంగుళూరులో ఉండి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారని కధనాలు వస్తున్నాయి. భూమా అఖిలప్రియకు బెయిల్ ఇస్తే ఆమె బాధితులను, సాక్షులను భౌతికంగా, మానసికంగా హింసించే అవకాశం ఉందని పోలీసులు వాదిస్తున్నారు. అంతే కాదు.. నిందితురాలి భర్త భార్గవ్‌రామ్‌కు నేర చరిత్ర ఉందని, దీనికితోడు ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నందున అఖిలను అరెస్టు చేయకుంటే మళ్లీ నేరాలు చేసే అవకాశముందని పేర్కొన్నారు.

కిడ్నాప్‌ వ్యవహారంలో పాల్గొన్న నిందితులు కూడా ఇప్పటిదాకా చిక్కలేదని, అఖిలను అరెస్టు చేయకుంటే ఆమె నిందితులతో సంప్రదింపులు జరిపి వారిని కాపాడేందుకు ప్రయత్నించే అవకాశముందని వివరించారు. అంతేకాదు.. బాధితుల కుటుంబాలపై దాడులకు పాల్పడే అవకాశముందని పేర్కొన్నారు.

ఇంతకీ పోలీసులు చెబుతున్న భార్గవ్‌ రామ్ నేర చరిత్ర ఏంటి.. ఓసారి చూద్దాం.. గతంలో ఆయన్ను  ఆళ్లగడ్డ పోలీసులు అరెస్టు చేశారు.  ఎన్నికల సమయంలో పోలింగ్ రోజున జరిగిన ఘర్షణ కేసు, ఇటీవల ఓ క్రషర్ వివాదంలో మరో కేసు ఆయనపై నమోదయ్యాయి. ఈ రెండు కేసుల్లో ఆయనకు కోర్టుకు హాజరు  కావడంతో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అంతే కాదు.. కేసు విచారణ కోసం వచ్చిన పోలీసులపై భార్గవ్ తో పాటు ఆయన అనుచరులు జులం ప్రదర్శించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్‌పై కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో రెండు కేసులు ఉన్నాయి. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లోనూ ఫిర్యాదు ఉంది. ఆళ్లగడ్డ ఎస్‌ఐ రమేశ్‌ కుమార్ భార్గవ రామ్ పై కేసు పెట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: