మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి కష్టాలే కనిపిస్తున్నాయి. వైసీపీ పట్టుదలతో ఆ పార్టీ కనీస పోటీ ఇచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు. చివరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడికి సైతం సొంత జిల్లాలోనే అదిరిపోయే జలక్ ఇస్తోంది వైసీపీ. మొదటి నుంచి టీడీపీకి కాస్త పట్టున్న జిల్లాలోనే ఇప్పుడు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గతేడాది టీడీపీ తరపున నామినేషన్ వేసిన నలుగురు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్ధులు సడెన్ గా  వైసీపీ జెండా కప్పేసుకోవడం ఆ పార్టీకి కోలుకోలేదని దెబ్బగా కనిపిస్తోంది.


పలాసలో టీడీపీకి అనూహ్యమైన దెబ్బ తగిలింది. సాధారణంగా ఎన్నికలకు ముందో.. ఎన్నికల్లో గెలిచాకో పార్టీలు మారుతుంటారు. కానీ ఇక్కడ ఓ పార్టీ తరపున నామినేషన్ వేసిన వారు సైతం.. పార్టీ మారేశారు. పలాసాలో గెలుద్దామనుకున్న టీడీపీకి ఇది ఊహించని పరిణామమే. సొంత జిల్లాలోనే ఇలాంటి షాక్ తగలడం అచ్చెన్నాయుడికి చిరాకు పెట్టిస్తోంది. టీడీపీ నుంచి నలుగురు కార్పొరేట్ అభ్యర్థులు వైసీపీలో చేరడం.. అది కూడా మంత్రి సీదిరి అప్పలరాజు సమక్షంలోనే చేరడం టీడీపీకి మింగుడుపడటం లేదు.  

ఇక ఇప్పుడు వైసీపీలో చేరిన వీరు నామినేషన్లు ఉపసంహరించుకుంటే.. ఇక వైసీపీకి పోటీయే ఉండదు. ఈ జంపింగుల వెనుక పూర్తిగా మంత్రి సీదిరి అప్పలరాజు చక్రం తిప్పేశారు.  టీడీపీ మాత్రం ఈ పరిణామంతో ఒక్కసారిగా షాక్‌లోకి జారుకున్నా ఆ తర్వాత తేరుకుని మిగిలిన కార్పొరేట్ అభ్యర్థులనైనా కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. వైసీపీ ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తోందని శ్రీకాకుళానికి చెందిన టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు.

వైసీపీ నేతలు మాత్రం రాజకీయాలన్నాక ఆ మాత్రం ట్విస్టులు ఉంటాయని సెటైర్లు వేస్తున్నారు. గతంలో వైసీపీ నుంచి లాక్కుని ఏకంగా మంత్రి పదవులు ఇవ్వలేదా అని గతం గుర్తు చేస్తున్నారు. ఈ చేరికలపై మొత్తం ఆధారాలతో సహా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామంటోంది. పాపం.. నిమ్మగడ్డ మాత్రం ఏం చేస్తారు..? 

మరింత సమాచారం తెలుసుకోండి: