హైదరాబాద్ మేయర్‌గా ఇటీవల సీనియర్ నేత కే కేశవరెడ్డి కుమార్తె గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు.. హైదరాబాద్ మేయర్ పదవి జనరల్ మహిళకు కేటాయించడంతో చాలా మంది చివరి వరకూ పోటీపడిన చివరకు ఆ పదవికి కేసీఆర్ కేకే కూతుర్ని ఎంపిక చేశారు. అయితే పాపం.. ఆమె పదవి ఎక్కడిన వేళా విశేషమో ఏమో కానీ.. వరుసగా ఆమె వివాదల్లో చిక్కుకుంటున్నారు.  మేయర్ అయిన కొన్ని రోజులకే.. హైదరాబాద్‌లో వర్షాలు కురవకూడదని దేవుడికి దండం పెడతా అంటున్న ఆమె వీడియో వైరల్ అయ్యింది.

ఆ వివాదం సద్దుమణిగిన కొన్ని రోజులకే.. ఆమె షేక్‌పేట ఎమ్మార్వో ఆఫీసులో వీరంగం వేశారంటూ మరో వార్త వచ్చింది. ఇక ఆ తర్వాత.. తాజాగా ఆమెపై డైరెక్టర్ ఆర్జీవీ అనేక సెటైర్లు పేలుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఆమె తన కుక్కకు తినిపించుకుంటూ తాను కూడా టిఫిన్ చేసిన వీడియో ఈ కామెంట్లకు కారణమైంది. హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మిపై ఆర్జీవీ  తనదైన స్టయిల్‌లో పంచులేశాడు. ఈ వీడియోలో గద్వాల విజయలక్ష్మి తన కుక్కకి కుడిచేత్తో తినిపిస్తూ..తాను మాత్రం ఎడమ చేత్తో తింటుంది.

ఈ వీడియోపై స్పందించిన వర్మ..'నిస్వార్థ ప్రేమకు ఇది నిదర్శనం. తన కుక్కకు కుడి చేత్తో తినిపిస్తూ..తాను మాత్రం ఎడమ చేత్తో తింటుంది. ఆమెకు కుక్కపై ఉన్న ప్రేమ ఎంతో  ఉన్నతంగా అనిపిస్తుంది. తక్షణమే ఆమెను  అంతర్జాతీయ కుక్కల మేయర్‌గా ఎంపిక చేయాలి. ఇంతగా ఆమె తన కుటుంబాన్ని, తన పార్టీని, తెలంగాణ ప్రజలను కూడా ప్రేమిస్తారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.. అంటూ పంచులు వదిలారు.

ఇది జరిగిన మరుసటి రోజే.. కరెంట్‌ కోతలపై మేయర్‌ విజయలక్ష్మి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు రాసిన లేఖ మీడియా చేతికి చిక్కింది. కరెంట్‌ కోతలతో క్యాంప్‌ ఆఫీస్‌లో పనిచేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు మేయర్‌ తెలిపారు. వరుస కరెంట్‌ కోతలతో పనులు వాయిదా పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాంప్‌ ఆఫీస్‌ దగ్గర 25 కెవి జనరేటర్‌ ఏర్పాటు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. దీంతో కరెంట్ కోతలు బాగా ఉన్నాయని ఏకంగా మేయరే ఒప్పుకున్నట్టు  మీడియాలో ప్రముఖంగా వచ్చింది. పాపం..ఇలా ఆమె కొద్దిరోజుల్లోనే కాంట్రావర్సీలకు కేరాఫ్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: