తెలంగాణ రాష్ట్రం లోని నిర్మల్ జిల్లా,  భైంసా గ్రామం రెండు వర్గాల మధ్య  మళ్ళీ మరోసారి అల్లర్లు చెలరేగాయి. పట్టణంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా  ఒక వర్గం పై మరో వర్గం రాళ్లు రువ్వుకున్నారు. ఆదివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఇరువర్గాలమధ్య చోటుచేసు కున్న గొడవ తీవ్రమై అల్లర్లకు దారితీసినట్టుగా తెలుస్తోంది.


జుల్ఫేకార్‌ గల్లీ, కుభీరు రహదారి, బట్టి గళ్లీ, గణేశ్‌ నగర్‌, మేదరి గల్లీలతోపాటు బస్టాండు ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుండగానే, ఆందోళనకారులు కొందరు, వాహనాలకు, దుకాణాలకు నిప్పు అంటించటంతో  అగ్నికీలల్లో , అవి దహనమయ్యాయి. ఇరువర్గాలు రాళ్లతో దాడులు చేసుకోగా, పలువురు చిన్నారులు, మహిళలకు గాయాలు  అయ్యాయి. గాయపడిన వారిలో ఎస్సై, కానిస్టేబుల్‌ తోపాటు ఇద్దరు మీడియా ఉద్యోగులు కూడా ఉన్నారు.


ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. రాళ్లదాడిలో దెబ్బలు తిన్నవారి తల, ముఖం, ఇతర సున్నిత భాగాలకు తీవ్రంగా దెబ్బలు తగిలాయి. రక్తం కారుతూనే వారిని ఆస్పత్రికి తరలిస్తున్న వీడియోలను చూస్తే ఘర్షణ తీవ్రంగా జరిగినట్లుగా అర్థమవుతోంది.


కొందరికి స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తుండగా, తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ కు తరలించారు. మరో వైపు అగ్నిమాపక దళం వెంటనే మంటలను అదుపు లోకి తెచ్చేందుకు ప్రయత్నించారు

 

పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తత సంతరించుకోగా బైంసా లో పహారా కోసం పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. అయితే అప్పటికే చాలా ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది. భైంసాలో గట్టి బందోబస్తు డీఎస్పీ నర్సింగ్‌రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.


ఇక, భైంసాలో జరిగిన అల్లర్లను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ తీవ్రంగా ఖండించారు. అల్లర్లలో ఇద్దరు రిపోర్టర్లు, పోలీసులు, బీజేపీ కార్యకర్తలు గాయపడటంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.



పోలీసులు వెంటనే అల్లర్లను ఆపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు భయపడి పోలీసులు ఒక వర్గానికి కొమ్ము కాయద్దని విమర్శించారు. భైంసాలో జరిగిన అల్లర్లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. గాయపడినవారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించాలని కోరారు.


ఘర్షణ నేపథ్యంలో పోలీసు బలగాలను భారీగా మోహరించారు. నిర్మల్ ఇంఛార్జి ఎస్పీ విష్ణు వారియర్ కూడా ఆదిలాబాద్ నుండి బైంసా బయలుదేరి వెళ్లారు. ఘటన స్థలాన్ని ఎస్పీ పరిశీలించనున్నారు. అదనపు పోలీసు బలగాలను నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల నుండి భారీగా భైంసాకు తరలిస్తున్నారు. గత సంవత్సరం కుడా తీవ్ర ఆందోళన కలిగించే తీరులో భైంసాలో అల్లర్లు చెలరేగిన సంగతి పాఠకులకు తెలుసు.


అప్పుడు ప్రభుత్వం ఒక వర్గానికి మద్దతు యిస్తూ అల్లర్ల విషయాన్నీ వెలుగులోకి రానివ్వకుండా కొంతవరకు నిరోధించినా - దేశీయ మీడియా దాన్ని బహిర్గతం చేసింది. అయితే తన మిత్రపక్షానికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అలుసు కారణం గానే ఆ వర్గం చెలరేగి పోతుందని భైంసా ప్రజలు ముక్తకంఠంతో చెపుతున్నారు.


కొన్ని సందర్భాల్లో విశ్వవ్యాప్త, దేశవ్యాప్త ఉగ్రవాద మూలాలు భైంసాలో బయటపడుతుండటంతో ప్రజల్లో ఆందోళనలు ఉధృతమౌతున్నాయి


 

మరింత సమాచారం తెలుసుకోండి: