చాలా మంది గుప్తనిధుల కోసం ఎక్కడపడితే అక్కడ తవ్వకాలు జరుపుతుంటారు. పొలాల్లో, కొండల్లో, దేవాలయాల్లో ఆఖరికి ఇళ్లల్లో కూడా తవ్వకాలు జరిపారనే వార్తలను మనం చాలా సార్లు విని ఉంటాం. కొంతమంది గుప్తనిధుల కోసం ఎంత రిస్క్ పనైనా చేస్తారు. ఎంతవరకైనా వెళ్తారు. గుప్తనిధుల కోసం హత్యలు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఏపీలోని తిరుపతి శేషాచలం అటవీ ప్రాంతంలో గుప్తనిధుల కోసం సొరంగం తవ్వడం కలకలం రేపింది.

శేషాచలం అటవీ ప్రాంతంలో ఏడాదికి పైగా గుట్టుచప్పుడు కాకుండా ఈ సొరంగం తవ్వుతున్నారు. ఈ విషయం ఇన్నిరోజులు బయటపడలేదు. ఆఖరికి అలిపిరి పోలీసులు ఈ  గుట్టు రట్టు చేశారు. సొరంగం తవ్వుతున్న ఓ ముఠాను అరెస్ట్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.  2014లో తిరుపతికి మకాం మార్చిన అనకాపల్లికి చెందిన పెయింటర్‌ నాయుడు అనే వ్యక్తి ఎం.ఆర్‌.పల్లెలో ఉంటూ కూలీల మేస్త్రీగా పనిచేస్తున్నాడు. అతడు తన భార్యను వదిలేసి ఒక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో అతడికి గుప్త నిధులను సొంతం చేసుకోవాలనే ఆశ మొదలైంది. అతడికి నెల్లూరుకు చెందిన రామయ్యస్వామితో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ కొన్ని పురాతన రాగిరేకులను బట్టి శేషాచలం అడవుల్లో గుప్త నిధి ఉందని భావించి పథకం రచించారు.

నాయుడు, రామయ్యస్వామిలు కలిసి ఓ ఆరుగురు కూలీలతో మాట్లాడుకొని గుప్త నిధుల కోసం తవ్వకాలు ప్రారంభించారు. గుట్టు చప్పుడు కాకుండా, విషయం ఎవరికీ తెలియకుండా సొరంగం తవ్వుతూనే ఉన్నారు. ఈ ముఠా ఇప్పటివరకు 80 అడుగుల సొరంగాన్ని తవ్వింది. శుక్రవారం రాత్రి ఈ ముఠా మంగళం వెంకటేశ్వర కాలనీ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతూ స్థానికులకు కనిపించారు. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు అలిపిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు రంగంలోకి దిగి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు గుప్త నిధుల తవ్వకాలకు వచ్చినట్లు ఒప్పుకున్నారు. వివరాలు సేకరించిన పోలీసులు మిగిలిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిధిని సొంతం చేసుకునేందుకు మరో 40 అడుగుల మేరకు తవ్వాలనుకున్నారు. కానీ ఇంతలో వీరి గుట్టు రట్టైంది. పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: