
పార్లమెంటరీ కమిటీ ట్విట్టర్ అధికారులను సమావేశానికి పిలిచిందన్న సంగతి తెలిసిందే. శుక్రవారం నాడు పార్లమెంటరీ కమిటీ ముందు ట్విట్టర్ అధికారులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ట్విట్టర్ గోప్యత మరియు సోషల్ మీడియా దుర్వినియోగం గురించి ప్రశ్నలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం, ట్విట్టర్ మధ్య వివాదం కొనసాగుతున్న నేపధ్యంలో ట్విట్టర్ అధికారులు శుక్రవారం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు హాజరు కావడం ఆసక్తికరంగా మారింది. పౌర హక్కులు మరియు మహిళల భద్రత దృష్ట్యా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల దుర్వినియోగం గురించి చర్చించడం కోసమే కమిటీ ట్విట్టర్ అధికారులతో సమావేశం అవుతున్న ముఖ్య ఎజెండా.
పార్లమెంటులో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు జరగనున్నఈ స్టాండింగ్ కమిటీ సమావేశానికి సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ అధికారులు కూడా హాజరుకానున్నారు. ఇటీవల, కొత్త ఐటి నిబంధనలను పాటించడం గురించి ట్విట్టర్ మరియు కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం మొదలయింది. ట్విట్టర్ కొత్త నిబంధనలను పాటించడంలో ఆలస్యం చేయడమే కాక అసలు పాటించాలా వద్దా అనే సంకోచంలో ఉన్న కారణంగా మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌కు మంజూరు చేసిన థర్డ్ పార్టీ హోదాను సైతం సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. దీంతో థర్డ్ పార్టీ వేదిక కాకవడంతో చట్టపరమైన జోక్యం నుండి ట్విట్టర్‌కు ఇచ్చిన మినహాయింపు కూడా ఉపసంహరించబడింది.
ఇక ఇప్పటూ నుంచి ప్రతి యూజర్ చేసిన పోస్ట్‌లకు ట్విట్టర్ బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇప్పటికే కొన్ని చోట్ల నకిలీ వార్తలను వ్యాప్తి చేసినందుకు ట్విట్టర్ మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇంతకుముందు స్టాండింగ్ కమిటీ చైర్మన్ శశి థరూర్ మరియు దాని సభ్యుడు మరియు బిజెపి ఎంపి నిషికాంత్ దుబే మధ్య మరో వివాదం ఉంది. కాంగ్రెస్ మరియు దాని మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎజెండాను మరింతగా పెంచడానికి స్టాండింగ్ కమిటీని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ నిషికాంత్ దుబే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను స్టాండింగ్ కమిటీ చైర్మన్ శశి థరూర్ ను ఆ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. మరి ఈ అంశం ఎంత దూరం వెళుతుందో వేచి చూడాలి మరి.