తెలంగాణ కాంగ్రెస్ కు పూర్వ వైభవం కోసం  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఓ వైపు ఇతర పార్టీల నుంచి నాయకుల చేరికలను ప్రోత్సహిస్తూనే... మరోవైపు సొంత ఇంటిని చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలంతా కలిసి ఉంటే టీఆర్‌ఎస్‌ను సులువుగా ఢీ కొట్టొచ్చని భావిస్తున్న రేవంత్... అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. గ్రూపు విభేదాలు సమసిపోయేలా స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. అందుకే టీపీసీసీ చీఫ్‌గా ఎంపికైన రోజు నుంచే సీనియర్లను కలుస్తున్నారు. తనకు ఎలాంటి భేషజాలు లేవని, పార్టీ బలోపేతం కోసం అందరం కలిసి పని చేద్దామని కోరుతున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావును  రేవంత్ రెడ్డి కలిశారు. హైదరాబాద్‌లో ప్రేమ్ సాగర్ రావు  నిర్వహించిన కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు.  ఉమ్మడి  జిల్లాలోని తన క్యాడర్‌ను రేవంత్‌కు పరిచయం చేశారు. పలువురు ఆశావహులతో పాటు పెద్ద సంఖ్యలో నేతలను సమీకరించడం ద్వారా ప్రేమ్ సాగర్ రావు తన పట్టును నిరూపించుకున్నారు.

నిజానికి రేవంత్ రెడ్డి టీపీసీసీ ఛీఫ్  అయిన తర్వాత జిల్లాలోని మరో సీనియర్ నేత మహేశ్వర్ రెడ్డి హడావుడి చేశారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ పదవి దక్కించుకున్న మహేశ్వర్ రెడ్డి అదే ఊపులో రేవంత్ రెడ్డి తొలి కార్యక్రమాన్ని నిర్మల్‌లో పెట్టించుకున్నారు. డీజిల్-పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా చేపట్టిన ర్యాలీలో రేవంత్ పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో  మహేశ్వర్ రెడ్డిని గెలిపించాలని చెప్పడం ద్వారా పరోక్షంగా ఆయన అభ్యర్థి త్వాన్ని కూడా ప్రకటించారు. ఈ పరిణామాలతో మాజీ ఎమ్మెల్సీ  ప్రేమ్ సాగర్‌రావు వర్గానికి చెక్ పెట్టినట్టేనన్న ప్రచారం జరిగింది.  అంతేకాదు ప్రేమ్ సాగర్ రావుకు రేవంత్ రెడ్డి కి మధ్య సయోధ్య లేదన్న ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ప్రేమ్ సాగర్ రావు ఇంటికి వెళ్లడం ద్వారా బయట జరుగుతున్న ప్రచారానికి రేవంత్ రెడ్డి చెక్ పెట్టారు. అంతేకాకుండా తనకూ, ప్రేమ్ సాగర్ రావు కు మధ్య ఎలాంటి  విభేదాలు లేవని స్పష్టం చేశారు.

ఇక టి.కాంగ్రెస్‌లో అందరినీ ఒకేతాటి పైకి తేవాలన్న రేవంత్‌రెడ్డి ప్రయత్నాలకు పార్టీ సీనియర్‌ల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది.  కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీలో భిన్నాభిప్రాయాలు సహజమని, అందరి లక్ష్యం పార్టీనీ అధికారంలోకి తేవడమేనన్న అభిప్రాయాలు జిల్లాలోని పార్టీ సీనియర్‌ నాయకుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన రేవంత్‌రెడ్డి..  ఆదిలాబాద్ జిల్లా నుంచే కాంగ్రెస్ జైత్రయాత్ర మొదలుపెడతామని ప్రకటించారట. మరి రేవంత్‌ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్‌ అవుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: