రైతుల తరఫున కేంద్రంతో పోరాడతామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ చేతుల్లో పెట్టొద్దని ఏడాదిగా రైతులు కోరుతున్నారని.. దీనిపై మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తానని స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తామని తెలిపారు. కేంద్రంపై పోరాడుతున్న రైతులకు మద్ధతుగా ఉంటామని స్పష్టం చేశారు.

మరోవైపు కేంద్రాన్ని టార్గెట్ చేసిన కేసీఆర్.. కేంద్రం పెట్రోల్ ధరలను కొండంత పెంచి.. పిసిరంత తగ్గించిందని కేసీఆర్ విమర్శించారు. నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు రానున్నందునే కంటితుడుపు చర్యగా ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిందన్నారు. పెట్రోల్, డీజిల్ పై తాము ఇప్పటి వరకు ఒక్క రూపాయి వ్యాట్ పెంచలేదన్నారు. ఏ నైతికతతో తాము వ్యాట్ తగ్గించాలని కేంద్రం మాట్లాడుతోందన్నారు. ప్రజలపై ప్రేమ ఉంటే ఇంధన ధరలపై సెస్సు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

యాసంగి ధాన్యంతో తాలు, నూకలు ఎక్కువగా వస్తాయని సీఎం కేసీఆర్ అన్నారు. యాసంగి దిగుబడిలో రా రైస్ రాదని.. వచ్చేది బాయిల్డ్ రైసేనని తెలిపారు. ఎఫ్ సీఐ రా రైస్ మాత్రమేనని కొంటానని.. బాయిల్డ్ రైస్ కొనలేమని చెబుతుందన్నారు. భవిష్యత్ లోనూ బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లేఖ అడుగుతోందని చెప్పారు. ఈ ఏడాదిలో ఎంత కొంటారో చెప్పాలని అడిగితే ఇప్పటి వరకు చెప్పలేదన్నారు. కేంద్రం తన బాధ్యతను విస్మరిస్తోందని విమర్శించారు.

రైతులు నష్టపోతారనే ఉద్దేశంతోనే యాసంగిలో వరిసాగు చేయొద్దని వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారని సీఎం కేసీఆర్ తెలిపారు. ధాన్య సేకరణ చేసే కేంద్రం ఇప్పుడు చేయమని తేల్చి చెబుతోందన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రైతు బంధు తీసుకొచ్చామన్నారు. 24గంటల విద్యుత్ సప్లై చేస్తున్నామని చెప్పారు. రైతు చనిపోతే రైతు బీమా కూడా ఇస్తున్నామన్నారు.ఇక రైతుల తరఫున కేంద్రంతో పోరాడతామన్న కేసీఆర్ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన జాతీయ రాజకీయల వైపు చూస్తున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్రమంత్రులు, నేతలతో చేపట్టే దీక్షతోనే ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.






మరింత సమాచారం తెలుసుకోండి: